India Vs South Africa T20 : ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించింది. న్యూజిలాండ్‌ను కూడా ఆ దేశంలోనే మట్టికరిపించింది. ఇక ఆస్ట్రేలియా గడ్డపైనా పైచేయి సాధించింది. కానీ సౌతాఫ్రికాలో మాత్రం ఇప్పటివరకూ టెస్టు సిరీస్ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలకాలంటూ టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ గెలుపొందాలన్న లక్ష్యంతో టీమ్‌ఇండియా మైదానంలో అడుగుపెట్టింది. ఆదివారం ప్రారంభం కానున్న టీ20తో తమ సత్తా చూపించేందుకు సిద్ధమైంది.
ఆ ఫార్మాట్లో ఒక్కసారే
వన్డే ఫార్మాట్లో సౌతాఫ్రికాలో ఆ జట్టుపై భారత్ ఒక్కసారి మాత్రమే విజయాన్ని అందుకుంది. ఈ రెండు జట్లు అక్కడ ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడ్డాయి. అయితే 2018లో జరిగిన ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు 5-1తో విజయ తీరాలకు చేరింది. రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లి సారథ్యంలోని ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి ప్రత్యర్థులను దాని గడ్డపైనే దెబ్బకొట్టింది. ఇక టీ20ల విషయానికి వస్తే భారత్‌దే పైచేయిగా నిలిచింది. 2018లోనే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. అంతకంటే ముందు 2006, 2011లో ఏకైక టీ20 మ్యాచ్‌ల్లో సఫారీలను ఓడించింది. 2012లో ఓ టీ20లో భారత్ ఓడింది.
అయితే సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం మాత్రం భారత్‌కు అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటివరకూ ఆ గడ్డపై టీమ్‌ఇండియా కేవలం ఎనిమిది టెస్టు సిరీస్‌లు మాత్రమే ఆడింది. కానీ ఒక్కసారి కూడా భారత్ విజేతగా నిలవలేకపోయింది. 1992-93లో అజహరుద్దీన్ సారథ్యంలో తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు వెళ్లింది. అయితే అప్పుడు నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా 0-1తో ఓటమిపాలైంది. ఇక 1996-97లో సచిన్ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌లో సిరీస్‌ను 0-2తో కోల్పోయింది.
మరోవైపు 2001లో సౌరభ్ గంగూలీ సారథ్యంలో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1తో చేజార్చుకుంది. 2006-07లో (ద్రవిడ్ కెప్టెన్) 1-2తో, 2013లో (ధోని కెప్టెన్) 0-1తో పరాజయం పాలైంది. ఇక కోహ్లి కెప్టెన్సీలో 2018, 2021-22లో 1-2తో భారత జట్టు ఓటమిని చవి చూసింది. 2010-11లో ధోని సారథ్యంలో సిరీస్ గెలిచేందుకు జట్టుకు మంచి అవకాశమే వచ్చింది. కానీ చివరి టెస్టు డ్రా కావడం వల్ల మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో ముగించింది.