IND vs SA T20 : సఫారీలతో టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ప్రారంభించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 106/8 స్కోరు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ ఒకే మూడు వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు అందుకొన్నాడు. అనంతరం ఛేదనలో భారత్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో 110 పరుగుల చేసి విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (51*), సూర్యకుమార్ (50*) అర్ధశతకాలు చేశారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లతోపాటు కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ మాట్లాడారు.
రోహిత్ శర్మ (భారత కెప్టెన్): పిచ్ చాలా కఠినంగా ఉంది. ఇలాంటి మ్యాచ్‌ల నుంచి చాలా నేర్చుకోవచ్చు. జట్టుకు ఎలాంటి పరిస్థితుల్లో ఏం కావాలనేది ఆటగాళ్లు అర్థం చేసుకోవాలి. పిచ్ మీద ఉన్న ఉన్న పచ్చికను మా బౌలర్లు చక్కగా వినియోగించుకొన్నారు. అయితే 20 ఓవర్ల పాటు పిచ్ సహకారిస్తుందని ఊహించలేదు. ఇరు జట్లకూ అవకాశాలు దొరికాయి. అయితే మెరుగ్గా ఆడిన జట్టు విజయం సాధించింది. ఆరంభంలోనే మేం ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచగలిగాం. పేసర్లు అద్భుతం చేశారు. పిచ్ పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. మేం త్వరగా రెండు వికెట్లు కోల్పోయినా.. రాహుల్-సూర్యకుమార్ మంచి భాగస్వామ్యం నిర్మించి విజయతీరానికి చేర్చారు.
టెంబా బవుమా (దక్షిణాఫ్రికా కెప్టెన్): పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మేం విఫలమయ్యాం. అయితే పిచ్ ఇలా ఉంటుందని ఊహించలేదు. మా బౌలర్లు మాత్రం బాగానే వేశారు. ప్రత్యర్థిని ఎదురించాలంటే తగినన్ని పరుగులు చేయాలి. వారి వరకు ఉత్తమంగా ప్రయత్నించారు. అయితే తొలుత వికెట్లు కోల్పోయినప్పటికీ తరువాత బాగానే బ్యాటింగ్ చేశాం. ఈ మ్యాచ్‌లో ఇదే సానుకూలాంశం.