India Vs South Africa 3rd T20 :సౌతాఫ్రికా సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి టీ20 టీమ్ఇండియా విజయంతో ముగిసింది. రెండో టీ20 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు రెట్టింపు వేగంతో ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ఆధిపత్యాన్ని చూపించింది. సెంచరీతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చితక్కొట్టగా, దీనికి బర్త్‌డే బాయ్ కుల్‌దీప్ యాదవ్ (5/17) మెరుపులు తోడయ్యాయి. దీంతో గురువారం జరిగిన పోరులో భారత్ 106 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి. అంతే కాకుండా 1-1తో సిరీస్‌ను సమం చేసింది. దీంతో ఇరు జట్లకు మేనేజ్మెంట్ ఒకే కప్‌ను అందించింది. మరోవైపు 'ప్లేయర్ ఆఫ ద మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' బిరుదు సూర్య కుమార్ ఖాతాలో పడ్డాయి.
ఇక సూర్యతో పాటు యశస్వి జైస్వాల్ (60) మెరవడం వల్ల మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కుల్‌దీప్‌తో పాటు జడేజా (2/25), ముకేశ్ (1/21), అర్ష్‌దీప్ (1/13) బంతితో రాణించారు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు 13.5 ఓవర్లకు 95 పరుగులు చేసి కుప్పకూలింది. ఆ జట్టులో మిల్లర్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సూర్య భాయ్ వన్ మ్యాన్ షో!
తొలుత సూర్య తనదైన శైలిలో విరుచుకుపడకపోవడం వల్ల పరుగులు అంతగా రాలేదు. ఈ క్రమంలో 6 నుంచి 10 ఓవర్ల మధ్య 31 పరుగులే వచ్చాయి. దీంతో సూర్య తానెదుర్కొన్న తొలి 24 బంతుల్లో 26 పరుగులే చేశాడు. 10 ఓవర్లకు స్కోరు 87/2. కానీ ఆ తర్వాత గేర్ మార్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్స్‌ల మోతతో కనువిందు చేశాడు. ఎక్స్‌ట్రా కవర్‌లో కళ్లు చెదిరే షాట్లను ఆడాడు. ఆ తర్వాత సూర్యకు హద్దే లేకుండా పోయింది. వరుసగా 6, 4, 6, 6 బాదడం వల్ల 13వ ఓవర్లో ఫెలుక్వాయో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు.