India Vs South Africa 3rd ODI :దక్షిణాఫ్రికాపై జరిగిన మూడో వన్డే సిరీస్‌లో టీమ్ఇండియాదే పై చేయిగా నిలిచింది. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసి సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ఇక అర్ష్‌దీప్ (4/30), అవేశ్ (2/45), వాషింగ్టన్ సుందర్ (2/38) దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. ఇక 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా సంజు శాంసన్ నిలవగా, అర్ష్‌దీప్ సింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది.
నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసిన భారత జట్టు సౌతాఫ్రికా ముందు 297 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో పలు స్టార్స్ తమ ఆట తీరుతో చెలరేగడం వల్ల టీమ్ఇండియా భారీ స్కోర్‌ను నమోదు చేయగలిగింది. సంజు శాంసన్ (108) శతకాన్ని సాధించగా, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (52) కూడా అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పి 38 పరుగులతో దూకుడుగా ఆడాడు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం 21 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ కూడా మెరుపు వేగంతో ఆడాడు. ఓపెనర్‌గా మైదానంలోకి దిగిన రజత్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ ఆ ఇన్నింగ్స్‌లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సులతో మెరిశాడు. అయితే టోర్నీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన సాయి సుదర్శన్ ఈ సారి నిరాశపరిచాడు. కేవలం 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదిలా ఉండగా సౌతాఫ్రికా బౌలర్లలో బ్యురాన్ హెండ్రిక్స్ 3 వికెట్లు పడగొట్టగా, నండ్రీ బర్గర్ రెండు విలియమ్స్, ముల్డర్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు సౌతాఫ్రికా జట్టు నుంచి టోనీ డి జోర్జి , రిజా హెండ్రిక్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మన బౌలర్లను కట్టడి చేస్తూ సౌతాఫ్రికా నిలకడగా ఆడారు. అయితే అర్ష్‌దీప్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో కేఎల్ రాహుల్‌కు చిక్కి రిజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. దీంతో సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు. ఆ తర్వాతి నుంచి భారత బౌలర్లు వేగం పెంచి ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వచ్చారు. దీంతో 15 ఓవర్లో సౌతాఫ్రికా తన రెండో వికెట్‌ను కోల్పోయింది.