India Vs South Africa 1st Test :సౌతాఫ్రికాలోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు అత్యుత్తమ ఫామ్‌ను కనబరచలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా కగిసో రబాడ (5/44) విజృంభించడం వల్ల తొలి రోజు 59 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం పడటం వల్ల ఆటకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే వాన తగ్గే సూచనలు కనిపించకపోవడం వల్ల ఇక మొదటి రోజు ఆటకు ముగింపు పలికారు అంపైర్లు.
ఇక టాప్ ఆర్డర్‌లో వచ్చిన ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టి అభిమానులను నిరాశపరిచాడు. ఆ తర్వాత యశస్వీ జైశ్వాల్ 17 పరుగులకు ఔటయ్యాడు. వెంటనే శుభ్‌మన్ గిల్ (2) కూడా వెనుతిరిగాడు. అయితే విరాట్ కోహ్లీతో కలిసి జట్టును ఆదుకుంటూ వచ్చిన శ్రేయస్ అయ్యర్ 31 పరుగులకే ఔటయ్యాడు. దీంతో టీమ్ఇండియాకు షాక్ తగిలింది. అయితే విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతుండటం వల్ల అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనూహ్యంగా విరాట్ (38) కూడా క్రీజులో నిలవలేకపోయాడు.
మరోవైపు మిడిల్ ఆర్డర్‌లో మైదానంలోకి దిగిన కేఎల్ రాహుల్ 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా సిరాజ్ (0*) కూడా నాటౌట్‌గా ఉన్నాడు. మిగిలిన వారిలో శార్దూల్ ఠాకూర్ (24) కూడా జట్టుకు మంచి స్కోర్‌ను అందించేందుకు ప్రయత్నించాడు. మరోవైపు సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా ఆడారు. నండ్రీ బర్గర్ 2, మార్కో జాన్సన్ ఒక వికెట్ పడగొట్టారు.