India vs Pakistan Asia Cup 2022 : మరో అద్భుత పోరుకు ఆసియా కప్ వేదిక కానుంది. చిరకాల ప్రత్యర్థుల ఆటను తిలకించేందుకు మనకు మరో అవకాశం లభించింది. సూపర్ 4లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య ఆదివారం సాయంత్రం రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దాయాది దేశంపై విజయంతో జోష్ మీద ఉన్న టీమ్‌ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌కు అతడు లేకపోవడం లోటుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం భారత జట్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, అశ్విన్, దీపక్ హుడా ఉన్నారు. జడేజా స్థానంలో దీపక్ హుడా, అశ్విన్‌ల్లో ఒకరిని ఎంచుకొనే అవకాశముంది. బ్యాటింగ్ ప్రధానమనుకుంటే హుడాకు, బౌలింగే ముఖ్యమనుకుంటే అశ్విన్‌కు ఛాన్స్ దక్కుతుంది. ప్రధాన స్పిన్నర్ చాహల్ కూడా టోర్నీలో ఇప్పటి వరకు తన ముద్రను చూపించలేకపోయాడు.