న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీమ్ఇండియా సులువుగా ఛేదిస్తుంది అనుకున్నారంతా. కానీ లఖ్‌నవూ పిచ్ మ్యాచ్‌ను రివర్స్ చేసింది. భారత బ్యాటర్లకు సవాల్ విసురుతూ.. క్రికెట్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఈ మ్యాచ్. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. చిన్న టార్గెట్ అయినా కాపాడుకొనేందుకు న్యూజిలాండ్ చేసిన పోరాటం కూడా శభాష్ అనిపించింది. లఖ్‌నవూ లాంటి పిచ్‌పై పరిస్థితులు ముందుగానే అంచనా వేసినా.. మ్యాచ్ ఇలా ముగుస్తుందని ఊహించలేకపోయారు ఇరు జట్ల కెప్టెన్లు.
మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటర్న్ పిచ్ గురించి చెప్పిన మాట అందరినీ ఆశ్చర్య పరిచింది. ''ఇక్కడి పిచ్ గణాంకాలను పరిశీలిస్తే ఛేదన కష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే తొలుత మేం బ్యాటింగ్ ఎంచుకొన్నాం'' అని మిచెల్ చెప్పాడు. అతడు చెప్పినట్టే అక్షరాలా పిచ్ స్వభావం చివరి వరకూ అలాగే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వంద లోపు స్కోరుకే చేతులెత్తేసింది. కివీస్ కనీసం ఇంకో 10 నుంచి 20 పరుగులు చేసినా పరిస్థితి వేరేలా ఉండేదని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ ''ఈ పిచ్ మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. టర్నింగ్ మరీ విపరీతంగా ఉంది. టీ20లకు సరిపోయే వికెట్ మాత్రం కాదు. అందుకే క్యురేటర్ మంచి పిచ్ తయారీపై మరింత దృష్టిపెట్టాలి'' అని చెప్పాడు అంటే పిచ్ ఎలా ఉందో అర్థమవుతుంది.
పిచ్ రిపోర్ట్‌లో ఏముంది..?
క్యురేటర్, క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం లఖ్‌నవూ పిచ్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 157 కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 129 మాత్రమే. అందుకే టాస్ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకొంటుంది. పిచ్ మీద పగుళ్లు ఎక్కువగా ఉండటం వల్ల బంతి టర్నింగ్ ఎక్కువైంది. స్లో బౌలర్లకు సహకారం లభించింది. అందుకే కివీస్ ఎక్కువగా స్పిన్నర్లను ప్రయోగించారు. అయితే బ్యాటింగ్‌లో కుదురుకుంటే మాత్రం భారీ ఇన్నింగ్స్‌లూ ఆడొచ్చని క్రీడా పండితుల విశ్లేషణ.
టీమ్ఇండియా కోచ్‌లు ఏమంటున్నారు..?
లఖ్‌నవూ పిచ్ గురించి టీమ్ఇండియా సారథి హార్దిక్ పాండ్య చేసిన కామెంట్లపై భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. ''పిచ్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు సరైన వ్యక్తి క్యురేటర్ మాత్రమే. అతడే సమాధానం ఇవ్వగలడు. అయితే ఇలాంటి పిచ్ మీద ఆడటం మాత్రం పెద్ద సవాలే. అదృష్టవశాత్తూ మ్యాచ్‌ను మనం నియంత్రించాం. ఈ పిచ్ మీద 120-130 టార్గెట్‌ను ఛేదించడం చాలా కష్టంగా ఉండేది. టీమ్‌ఇండియా బౌలర్లు అద్భుతంగా బంతులను సంధించి కివీస్‌ను 99కే కట్టడి చేశారు. తొలుత పిచ్‌ను చూసినప్పుడు చాలా పొడిగా ఉంది. మధ్యలోనే కాస్త గ్రాస్ ఉంది. కానీ, వికెట్‌కు రెండు వైపులా పగుళ్లు వచ్చాయి. మ్యాచ్‌కు ముందు రోజే పిచ్‌ను చూడగానే.. ఇక్కడ టర్నింగ్ బాగుంటుందని, సవాల్ తప్పదని అనుకొన్నాం'' అని పరాస్ వెల్లడించాడు.
అందరిలోనూ ఉత్కంఠ రేపింది..
''మాతోపాటు స్టేడియంలో, టీవీల్లో వీక్షించిన అభిమానులు.. అలాగే మీరు (కామెంటేటర్లు) కూడా ఉత్కంఠను అనుభవించారు. మ్యాచ్‌లో విజయం సాధించే వరకు కుదురుగా ఉండలేకపోయాం. ఇలాంటి పిచ్‌పై ఆడటం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అన్ని జట్లూ ఇతర దేశాలకు పర్యటించినప్పుడు కావాల్సినన్ని బౌలింగ్ వనరులతో వస్తాయి. అయితే ఇలా ఎక్కువగా స్పిన్ పిచ్‌ల మీద ఆడేటప్పుడు నైపుణ్యమంతా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక మ్యాచ్‌లో రనౌట్లు జరగడం సర్వసాధారణం. అయితే క్రీజ్‌లో సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ ఉండటం చాలా ముఖ్యమనిపించింది'' అని వాషింగ్టన్ యువ బ్యాటర్ సుందర్ తెలిపాడు.