India Vs Newzealand Semifinals Rainfall : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 మెగా టోర్నీ తుది అంకానికి చేరుకుంది. దీంతో మరో వారం రోజుల్లో వరల్డ్‌కప్ జాతర కూడా ముగియనుంది. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచులన్నీ ఐసీసీ షెడ్యూల్ ప్రకారం సాఫీగానే సాగినా.. కీలక దశలో మాత్రం వరణుడి భయం క్రికెట్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి. వీటిల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. నవంబర్ 15 బుధవారం ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తొలి సెమిఫైనల్లో పోటీపడనున్నాయి. మరోవైపు నవంబర్ 16 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగే రెండో సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-ఆసీస్ జట్లు తలపడనున్నాయి.
ఎన్నో సందేహాలు..
ఇదిలా ఉంటే నవంబర్ 15న జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్‌కు మాత్రం వర్షం పడే సూచనలున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో ఆ రోజు వర్షం పడితే మ్యాచ్ పరిస్థితేంటి అన్న ప్రశ్నలు సదరు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఫైనల్‌కు చేరే జట్టేదో అనే సందేహాలూ వస్తున్నాయి. మరి ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారితే ఇరు జట్లకున్న సాధ్యాసాధ్యాల గురించి ఓసారి చూద్దాం.
కచ్చితంగా అన్ని ఓవర్లు ఆడాల్సిందే..
2023-వరల్డ్‌కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ ఒక రిజర్వ్‌డేని కేటాయించింది. అంటే బుధవారం భారత్-కివీస్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోతే.. ఆ మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే నవంబర్ 16న(గురువారం) తిరిగి మొదలుపెడతారు. అంటే రిజర్వ్ డే రోజున ఇరు జట్లు మళ్లీ ఆటను కొనసాగిస్తాయి. అలాగే ఈ రిజర్వ్ డే రోజు అదనంగా రెండు గంటల సమయాన్ని కూడా కేటాయించింది ఐసీసీ. అయితే ప్రత్యేకంగా కేటాయించిన రోజున ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 20 ఓవర్లైనా కచ్చితంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే?
ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా ఆట ముందుకు సాగకపోతే పాయింట్ల పట్టికలో ఏ జట్టైతే లీడింగ్‌లో ఉందో ఆ టీమ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిస్థాయిలో జరగకపోతేనే రిజర్వ్ డే లభిస్తుంది. ఇక ఇలాంటి సందర్భమే రెండో సెమిఫైనల్ ఆడనున్న దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లకూ ఎదురైతే అచ్చం పైన వివరించిన పద్ధతినే అనుసరిస్తారు.