IND Vs Nz Shubman Gill: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. టీమ్ఇండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డాడు. 149 బంతుల్లో 9 సిక్స్‌లు, 19 ఫోర్ల సాయంతో 208 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్,హెన్రీ షిప్లే తలో రెండు వికెట్ల పడగొట్టగా.. మిచెల్ సాంతర్, బ్లెయిర్ టిక్నర్, లాకీ ఫెర్గూసన్ చెరో వికెట్ తీశారు.
వన్డేల్లో ఐదో టీమ్ఇండియా క్రికెటర్‌గా..
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత క్రికెటర్‌గా శుభమన్ గిల్ నిలిచాడు. సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల తర్వాత గిల్ డబుల్ సెంచరీ ఫీట్‌ను అందుకున్నాడు. వీరిలో రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకం సాధించాడు.
వెయ్యి పరుగులు పూర్తి..
ఈ మ్యాచ్‌తో వన్డేల్లో గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌లు ఈ ఫీట్‌ను అందుకున్నాడు. దీంతో అతడు కోహ్లీ, ధావన్ రికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ 27 మ్యాుచుల్లో 24 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును సాధించగా.. ధావన్ 24 మ్యాచులు 24 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను అందుకున్నాడు.
వన్డేల్లో ద్విశతకం చేసిన పిన్నవయుస్కుడిగా..
వన్డేల్లో ద్విశతకం చేసిన పిన్నవయస్కుడిగా కూడా గిల్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌పై 24 ఏళ్ల 145 రోజుల వయసులో ద్విశతకం సాధిస్తే.. గిల్ 23 ఏళ్ల 132 రోజుల వయసులో ఆ రికార్డు తిరగరాశాడు.
హైదరాబాద్‌లో అత్యధిక పరుగులు చేసిన..
వన్డేల్లో హైదరాబాద్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా గిల్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇద్దరితో 50 పార్ట్‌నర్‌షిప్
అయితే ఈ మ్యాచ్లోరోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ (5) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. దీంతో గిల్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. సూర్యకుమార్, పాండ్యాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. తన కళాత్మక షాట్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు.