శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య తొలివన్డే హైదరాబాద్ వేదికగా జరగనుంది. సొంతగడ్డపై కివీస్‌ను కూడా చిత్తు చేయాలని భారత జట్టు కోరుకుంటోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో వేగవంతమైన డబుల్ సెంచరీతో కదంతొక్కినా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు తుది జట్టులో చోటు దక్కని ఇషాన్ కిషన్‌కు ఈసారి బరిలోకి దిగే అవకాశం దక్కనుంది.
వ్యక్తిగత కారణాల వల్ల కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరంకావడంతో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ తుదిజట్టులోకి రానున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమల్ గిల్ ఉండటంతో మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కెరీర్‌లో ఆడిన 10 వన్డేల్లో ఇషాన్ కిషన్ మూడుసార్లు మిడిల్ ఆర్డర్‌లోనే బరిలోకి దిగాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక శతకం, ఒక అర్థశతకంతో శుభమన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. చివరి 4 వన్డేల్లో 3 శతకాలు నమోదు చేసి విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉండగా.. అనారోగ్యంతో శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.