భారత్, న్యూజిలాండ్ జట్లు మరో ఐదు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) పోటీపడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ టోర్నీలో భారత్.. కివీస్ మినహా అన్ని జట్లపైనా విజయం సాధించి సగర్వంగా తుదిపోరుకు సిద్ధమైంది. అయితే, ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడాల్సి రావడం వల్ల కోహ్లీసేన ఈసారి ఎలా ఆడనుందనే విషయం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పలుమార్లు భారత్‌కు షాకివ్వడం కూడా ఇప్పుడు కొత్తగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఎప్పుడెప్పుడు ఆ జట్టుతో ఓటమిపాలైందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
దాదా శతకం వృథా..
2000 ఏడాది ఐసీసీ నాకౌట్ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్ తొలిసారి షాకిచ్చింది. సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) నేతృత్వంలోని జట్టును స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమ్ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంగూలీ (117; 130 బంతుల్లో 9x4, 4x6), సచిన్ (69; 83 బంతుల్లో 10x4, 1x6) కివీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. వీరిద్దరూ తొలివికెట్‌కు 26.3 ఓవర్లలో 141 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు.
అదే సమయంలో సచిన్ వెనుదిరగ్గా ఆపై వచ్చిన రాహుల్ ద్రవిడ్ (22), యువరాజ్ సింగ్ (18), వినోద్ కాంబ్లీ (1), రాబిన్‌సింగ్ (13), అజిత్ అగార్కర్ (15) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దాంతో చివరికి టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 264/6తో సరిపెట్టుకుంది. ఛేదనలో కివీస్ 49.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. క్రిస్‌కేర్న్స్ (102*; 113 బంతుల్లో 8x4, 2x6) శతకంతో చెలరేగాడు. అతడికి క్రిస్ హారిస్ (46; 72 బంతుల్లో 4x4) చక్కటి సహకారం అందించాడు. దాంతో న్యూజిలాండ్ రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
లక్ష్యం 127 కానీ..79కే ఆలౌట్..
ఇక 2016 టీ20 ప్రపంచకప్(T20 world cup 2016) సందర్భంగా భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-2లో పదమూడో మ్యాచ్‌లో తలపడ్డాయి. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేన్ విలియమ్సన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126/7 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దాంతో భారత్ సునాయాస విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ధోనీసేన ఛేదనలో మరింత దారుణంగా ఆడి టీ20ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
భారత బౌలర్లు అశ్విన్, నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా కట్టుదిట్టంగా బంతులేసి తలా ఓ వికెట్ తీసి కివీస్‌ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. ఆ జట్టులో కొరే అండర్సన్ (34; 42 బంతుల్లో 3x4), లూక్ రోంచి (21; 11 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ (23; 27 బంతుల్లో 2x4), ధోనీ (30; 30 బంతుల్లో 1x4, 1x6) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో చివరికి 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ శాంట్నర్ 4/11 కెరీర్‌లో గొప్ప గణాంకాలు నమోదు చేశాడు.