టీ20 ప్రపంచకప్ గాయాలకు మందు రాస్తూ సొంతగడ్డపై రెండు వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా.. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌పై స్పష్టమైన ఆధిపత్యం చలాయిస్తూ, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన రోహిత్ సేన.. మూడో మ్యాచ్‌లోనూ పట్టు వదలకూడదని భావిస్తోంది. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ప్రయోగాలు చేయడానికి ఈ మ్యాచ్ వేదిక కావచ్చు.
కొత్త కెప్టెన్, కోచ్‌లు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌ల నేతృత్వంలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సిరీస్ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ చివరి పోరు ఆదివారమే(నవంబరు 21). టీ20 ప్రపంచకప్‌లో తమను ఓడించడమే కాకుండా ఫైనల్ కూడా చేరిన కివీస్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలతో సిరీస్ సాధించడం కచ్చితంగా భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. సిరీస్ సాధించినప్పటికీ ఉదాసీనతకు తావివ్వకుండా క్లీన్‌స్వీప్ సాధించాలని రోహిత్ సేన చూస్తోంది.
వాళ్లిద్దరికీ ఛాన్స్?
తొలి రెండు టీ20లో కొత్త ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్‌లకు అవకాశం కల్పించిన జట్టు యాజమాన్యం.. చివరి మ్యాచ్‌లో ఒకరిద్దరికి తుది జట్టులో చోటిచ్చే అవకాశముంది. రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్ మైదానంలో దిగడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రుతురాజ్.. ధావన్ నేతృత్వంలో శ్రీలంకలో పర్యటించిన ద్వితీయ శ్రేణి జట్టులో సభ్యుడు. అప్పుడు రెండు టీ20లు ఆడిన రుతురాజ్.. మరో అవకాశం కోసం చూస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో చెన్నై ఓపెనర్‌గా గొప్పగా రాణించిన ఈ మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇదే లీగ్‌లో దిల్లీ తరఫున వరుసగా రెండు సీజన్లలో సత్తా చాటి టీమ్‌ఇండియా తలుపు తట్టిన మధ్యప్రదేశ్ పేసర్ అవేశ్ ఖాన్ కూడా అరంగేట్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరి కోసం రాహుల్‌తో పాటు భువనేశ్వర్, దీపక్ చాహర్‌ల్లో ఒకరికి విశ్రాంతినివ్వొచ్చు. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన అశ్విన్, అక్షర్‌ల్లో ఒకరిని తప్పించి చాహల్‌ను ఆడించేందుకు ఆస్కారముంది. తొలి టీ20ని మించి రెండో మ్యాచ్‌లో మరింత పక్కాగా ప్రణాళికలు అమలు చేయడం, కివీస్‌పై అలవోకగా గెలవడం టీమ్‌ఇండియాకు సానుకూలాంశాలు. ముఖ్యంగా రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన కివీస్‌ను బౌలర్లు కట్టడి చేసిన తీరు ప్రశంసనీయం. రోహిత్ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించాయీ మ్యాచ్‌లో. బౌలింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో మాత్రం శ్రేయస్ అయ్యర్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. వెంకటేశ్ అయ్యర్ కూడా సత్తా చాటుకోవాల్సి ఉంది. అతడికి ఇంకా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. చివరి టీ20లో అతడి చేతికి రోహిత్ బంతి అందించొచ్చు. గత మ్యాచ్‌లో మాదిరే బ్యాటింగ్‌లో కాస్త ముందు పంపే అవకాశముంది.