న్యూజిలాండ్ పర్యటన ఫలితం ఎలా ఉన్నా దీని ద్వారా టీమ్‌ఇండియాకు మంచే జరిగిందంటూ మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. దీని ద్వారా యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చిందన్నాడు. ఈ సిరీస్‌ను 1-0తో కివీస్ జట్టు గెలిచింది. చివరి రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. ఉమ్రాన్ మాలిక్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో తమ ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. "ఈ వన్డే సిరీస్ వల్ల మంచే జరిగింది. శ్రేయస్ రెండు మ్యాచుల్లో అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో నిలదొక్కుకోగలిగాడు. సూర్యకుమార్ సామర్థ్యం, ప్రతిభ ఉన్న ఆటగాడు కాబట్టి అతడు కచ్చితంగా బాగానే ఆడతాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌తో కట్టిపడేశాడు. దీనిని అతడు నిలుపుకోగలిగితే అద్భుతంగా రాణిస్తాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరంభంలో శుభ్‌మన్ గిల్ ఆకట్టుకొన్నాడు. ఈ పర్యటనలో జట్టు ఎదుర్కొన్నవి చాలా క్లిష్టమైన, అరుదైన పరిస్థితులు. ఈ అవకాశం అన్నిసార్లు లభించకపోవచ్చు. అందుకే, ఈ అనుభవం ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడి మైదానం, వాతావరణం అన్నింటినీ భవిష్యత్తులో పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గాయం కారణంగా కొంత కాలం జట్టుకు దూరమైన సుందర్ ఈ అవకాశాన్ని అద్భుతంగా ఒడిసిపట్టాడు. బ్యాటింగ్ పరంగా మంచి పరిణతి చూపాడు. క్లిష్ట సమయంలో టాప్ ఆర్డర్ సైతం తడబడింది. కానీ, ఇతడు మాత్రం పొందికగా ఆడాడు. కఠినమైన పరిస్థితుల్లో అర్ధశతకం కొట్టడం అంత తేలిక కాదు. ఈ ఇన్నింగ్స్ సుందర్‌కి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది'' అని తెలిపాడు.