టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) పూర్తయిన వెంటనే టీమ్ఇండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. నవంబర్ 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 టీ20లు, రెండు టెస్టుల సిరీస్ (India vs New Zealand) ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో, టీ20 ప్రపంచకప్‌లో తమను ఓడించిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్న తొలి సిరీస్ ఇదే.
టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు సారథిగా తప్పుకోనున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli News) ఇదివరకే ప్రకటించాడు. ఇక సీనియర్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. "రోహిత్‌పై (Rohit Sharma News) నిర్ణయం అతడితో చర్చించిన తర్వాతే ఉంటుంది. విశ్రాంతి తీసుకోవాలని భావించే స్వేచ్ఛ అతడికి ఉంది. అయితే టీమ్ఇండియాను అతడు నడిపించాలని మేం కోరుకుంటున్నాం" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
ఈ కుర్రాళ్లకు పిలుపు..
వచ్చే సిరీస్ కోసం జట్టును ప్రకటించే ముందు క్రికెటర్ల ప్రదర్శనను అంచనా వేయడానికి కొందరు సెలక్టర్లు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారని సమాచారం. ఐపీఎల్ 2021లో (IPL 2021 News) అదరగొట్టిన పలువురు క్రికెటర్లకు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. వారిలో రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, చేతన్ సకారియాలను న్యూజిలాండ్‌తో సిరీస్ (New Zealand Tour of India) కోసం పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన వెంకటేశ్ అయ్యర్.. రెండో దశ ఐపీఎల్లో అద్భుతంగా ఆడాడు. 10 మ్యాచుల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2021 విన్నర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. అవేశ్ ఖాన్, చేతన్ సకారియా కూడా ఈ ఐపీఎల్లో ఆకట్టుకున్నారు. హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి:టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా ఆ పేసర్!