India Vs Netherlands World Cup 2023 :వరుస విజయాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టీమ్‌ఇండియా జట్టు.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో నెదరాండ్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు సూపర్ ఫామ్‌తో దుసుకెళ్లిన రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడి..డచ్ జట్టుపై గెలుస్తుందన్న విషయంలో ఆశ్చర్యం లేదు. ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న భారత్.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని కసిగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ తమ సత్తా చాటుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రానున్న సెమీఫైనల్స్ నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌ను అందుకోవాలని ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. మిగతా ప్రధాన బ్యాటర్లంతా కనీసం ఒక్క అర్ధశతకమైనా సాధించారు. కానీ సూర్య కుమార్ మాత్రం పరుగుల వేటలో బాగా వెనుకబడ్డాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 21.25 సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సూర్య తిరిగి ఫామ్‌లోకి వచ్చి జట్టుకు తన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు.
వరుస విజయాల వల్ల ఎవరూ గుర్తించట్లేదు కానీ.. టీమ్ఇండియా టాప్ ఆర్డర్‌లోనూ ఓ చిన్న సమస్య ఉంది. ఓపెనర్లు రోహిత్, గిల్‌లు మూడుసార్లు 50పై స్కోర్ అందించారు కానీ.. మిగతా సమయాల్లో ఓపెనర్ల భాగస్వామ్యం త్వరగా విడిపోయింది. అయిదు మ్యాచ్‌ల్లో 5, 32, 23, 26, 4 వద్ద తొలి వికెట్ పడి భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో రానున్న మ్యాచ్‌ల్లో రోహిత్-గిల్ నుంచి బలమైన ఆరంభాలను జట్టు కోరుకుంటోంది. ఇక పేసర్లు, స్పిన్నర్లు గొప్పగా రాణిస్తుండటం వల్ల బౌలింగ్‌లో భారత్‌కు ఎలాంటి సమస్యలు రాలేదు.
కోహ్లీ.. ఆ సెంచరీని దాటేస్తాడా..
Virat Kohli World Cup 2023 : రానున్న మ్యాచ్‌లో అత్యంత ఆసక్తి కలిగిస్తోన్న అంశం కోహ్లి 50వ వన్డే సెంచరీ. ఇప్పటి వరకు 49 శతకాలు బాది సచిన్ తెందుల్కర్ రికార్డుకు సమమైన కోహ్లీ.. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో శతకం బాది సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడా లేదా అన్నది ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. ఇక జోరు మీదున్న విరాట్‌ను ఆపడం నెదర్లాండ్స్‌కు పెద్ద సవాలుగా మారనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 543 పరుగులు చేసిన కోహ్లి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ / రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా/ప్రసిద్ధ్ కృష్ణ, మొహ్మద్ షమి, మొహ్మద్ సిరాజ్