India vs Nepal Asia Cup 2023 :2023 ఆసియా కప్‌లో భాగంగా భారత్ రెండో మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. పల్లెకెలె వేదికగా సోమవారం భారత్.. నేపాల్‌తో తలపడనుంది. అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్.. బ్యాటింగ్ వైఫల్యాలను సరిదిద్దుకొని మినీటోర్నీలో ఈ మ్యాచ్‌తోనైనా బోణీ కొట్టి, సూపర్ 4 కు అర్హత సాధించాలని భావిస్తోంది.
తొలి మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ఇండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్ పేసర్ల పదునైన బంతులను ఎదుర్కోలేక.. వికెట్లు పారెసుకుంది. ఈ మ్యాచ్‌లోనైనా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వారికి అద్భుతమైన ఛాన్స్..
యువ సంచలనం శుభ్‌మన్ గిల్ వన్డేల్లో లయ తప్పినట్లు కనిపిస్తున్నాడు. విండీస్ పర్యటనలో కూడా మూడింట్లో ఒకే మ్యాచ్‌లో రాణించి.. రెండింట్లో ఫెయిలయ్యాడు. ఇప్పుడు మినీ టోర్నమెంట్ పాక్‌తో మ్యాచ్‌లో గిల్.. చాలా ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. తేమగా ఉన్న పిచ్‌పై పరుగులు చేసేందుకు బాగా కష్టపడ్డాడు. ఇక పసికూన నేపాల్‌పై అయినా చెలరేగి.. తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సుమారు ఆరు నెలల తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఎన్నోఅంచనాలతో తొలి మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ త్వరగానే పెవిలియన్ చేరాడు. సోమవారం నాటి మ్యాచ్‌లోనైనా అయ్యర్.. నేపాల్‌పై రాణించి ఫామ్‌ను అందుకునేందుకు అతడికి సూపర్ ఛాన్స్ ఉంది.
బౌలర్లు ఏం చేస్తారో.. భారీ వర్షం కారణంగా మొదటి మ్యాచ్‌లో భారత్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. భారత్‌కు తిరుగు పయణమయ్యాడు. ఇప్పుడు బుమ్రా స్థానంలో మహమ్మద్ షమి జట్టులోకి రానున్నాడు. మరి పసికూన నేపాల్‌ను భారత బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.