India vs Bangladesh World Cup 2023 : 2023 వన్డే వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో టీమ్ఇండియా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. 3 వికెట్లు కోల్పోయి 41.3 ఓవర్లలో 261 పరుగులు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (103*; 97 బంతుల్లో 6x4, 4x6) విజృంభించాడు.
సిక్సర్‌తో ఫినిష్..
చివర్లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. భారత్‌కు భారీ విజయాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (53; 55 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ (48; 40 బంతుల్లో 7x4, 2x6) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (19; 25 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించాడు. కేఎల్ రాహుల్ (34*; 34 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టగా, హసన్ మహ్మద్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాంజిద్ హసన్ (51; 43 బంతుల్లో 5x4, 3x6), లిట్టన్ దాస్ (66; 82 బంతుల్లో 7x4) అద్భుత ప్రదర్శన చేశారు. ఆ తర్వాత వచ్చిన నజ్ముల్ శాంటో (8), మెహదీ హసన్ మిరాజ్ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయి పెవిలియన్ చేరారు. తౌహిద్ హృదోయ్ (16), నసుమ్ అహ్మద్ (14) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ముష్ఫీకర్ రహీమ్ (38; 46 బంతుల్లో) రాణించాడు. చివర్లో మహ్మదుల్లా (46; 36 బంతుల్లో 3x4, 3x6) దూకుడుగా ఆడాడు. టీమ్ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా రెండు చొప్పున వికెట్ల పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.