తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతి కష్టం మీద టెస్టు సిరీస్‌ గెలిచారు.. మరి సమస్యల సంగతేంటి? - బంగ్లా టెస్టుతో భారత్​ నేర్వాల్సిన పాఠాలు

బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టులో అతికష్టం మీద విజయం సాధించింది టీమ్ఇండియా. చిన్నపాటి టార్గెట్​తో బరిలోకి దిగిన భారత జట్టును బంగ్లా బౌలర్లు హడలెత్తించారు. అశ్విన్​, శ్రేయస్ తోడ్పాటుతో గట్టెక్కారు. కానీ టీమ్​ఇండియా చాలా సమస్యలతో సతమతమవుతోంది. ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇదే.

India VS Bangladesh second Test
India VS Bangladesh second Test

By

Published : Dec 25, 2022, 6:26 PM IST

హమ్మయ్య సిరీస్‌ నెగ్గేశాం.. 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేశాం.. ఇక అంతా బాగుంది అనుకోవడానికైతే ఏం లేదు. ఎందుకంటే.. ఉపఖండ పిచ్‌లపైనే తడబాటుకు గురి కావడం మరింత కలవరపెట్టే అంశం. బంగ్లాతో టెస్టు సిరీస్‌ నుంచి చాలా పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్‌ ఒక మాట అన్నాడు. 'మిడిలార్డర్‌లో ఆడే ఆటగాళ్లపై నమ్మకం ఉంచాం.. ఎప్పుడూ నమ్ముతూనే ఉంటాం. కానీ మేమంతా మనుషులం'' అంటూ వ్యాఖ్యలు చేశాడు.

భారత్​ గెలుపు

మరి నీ మీదే నమ్మకం పోతోంది..
రాహులూ నిజమే బ్యాటర్లపై నమ్మకం ఉంచడంలో తప్పే లేదు.. కానీ వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన వారిని ఏమనాలి..? అందరి గురించి కాకుండా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌నే తీసుకోండి.. రెగ్యులర్ కెప్టెన్​ రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును అద్భుతంగానే నడిపించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ వనరులను ఎప్పటికప్పుడు ఉపయోగించుకొంటూ సిరీస్‌ను సొంతం చేసుకొన్నాడు. కానీ వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. గత టీ20 ప్రపంచకప్‌లోనూ పెద్దగా ఆడిందేమీ లేదు. అయినా సరే జట్టులో మాత్రం సుస్థిర స్థానం.. ఇంకెన్నాళ్లు ఇలా అవకాశాలు ఇస్తారని అభిమానులు నెట్టింట్లో తెగ ట్రోలింగ్‌ చేసేశారు. విరాట్ కోహ్లీ కూడా తన మునుపటి ఫామ్‌ను కోల్పోయాడా..? అన్నట్లుగా ఆడాడు.

భారత్​ గెలుపు

రెండున్నర రోజులు మనదే హవా..
తొలి టెస్టులో అన్ని విభాగాల్లో రాణించిన భారత్‌ను చూసిన అభిమానులు బంగ్లాపై పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తారని ఆశించారు. తీరా రెండో టెస్టు మ్యాచ్‌ వచ్చే నాటికి పరిస్థితి తిరగబడింది. మన బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. తొలి రెండున్నర రోజులపాటు ఆధిపత్యం కొనసాగించిన భారత్‌.. తీరా స్వల్ప లక్ష్య ఛేదనకు దిగేసరికి బంగ్లా స్పిన్నర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయింది. 145 పరుగుల లక్ష్యం.. టీమ్‌ఇండియా వంటి జట్టుకు పెద్ద కష్టమే కాదు. అయితేనేం బంగ్లా బౌలర్లు కంగారు పెట్టించారు. ఆ జట్టు స్పిన్నర్లు గింగిరాలు తిప్పించారు.

భారత్​ గెలుపు

ఇదేం బ్యాటింగ్‌..?
ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నప్పుడు అనవసరంగా ముందుకొచ్చి వికెట్లు ఇవ్వడం.. మరీ దారుణం. భారత ఇన్నింగ్స్‌లో 'నయా వాల్‌' ఛెతేశ్వర్‌ పుజారా, శుబ్‌మన్‌ గిల్‌ ఇలా స్వీయ తప్పిదాలతో పెవిలియన్‌ చేరారు. ఇక షరామామూలుగా కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ చేతులెత్తేశాడు. ఎంతో ఓపిగ్గా ఆడిన విరాట్ కోహ్లీ కూడా ఔటయ్యాడు. బంగ్లా స్పిన్‌ బౌలింగ్‌లో మరీ ఆత్మరక్షణ ధోరణితో బ్యాటింగ్‌ చేయడం వల్లే ఇలా వికెట్లను కోల్పోవాల్సి వచ్చిందనే వాదనా ఉంది. అదీ నిజమే అనిపిస్తోంది.. మనపై ఒత్తిడి తగ్గి.. ప్రత్యర్థి బౌలర్లపై పెరగాలంటే క్రీజ్‌లోని బ్యాటర్లలో ఒక్కరైనా కాస్త దూకుడు ప్రదర్శిస్తే బాగుండేది. అప్పుడు అటాకింగ్‌ ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో బ్యాటర్ల మీద పైచేయి సాధించకుండా చేసే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు.

భారత్​ గెలుపు

ఓపిగ్గా ఉంటే..
నాలుగో రోజు ఆటలో ప్రతి క్షణం ఉత్కంఠభరితం. ప్రతి బంతి వికెట్‌ తీసేలా దూసుకొచ్చింది. తొలి గంటలోనే మూడు వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో ఒక దశలో ఓటమి ఖాయమేమో అన్నట్లుగా టీమ్‌ఇండియా అభిమానుల్లో టెన్షన్‌ పెరిగిపోయింది. అయితే చివరికి ఇద్దరు బ్యాటర్లు అడ్డుగా నిలబడి.. బంగ్లాను ఓడించి మరీ సిరీస్‌ను భారత్‌ సొంతం చేశారు. ప్రారంభంలో రిషభ్‌ పంత్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే కొత్త బంతి కావడంతో షాట్లు కొట్టేందుకు బ్యాటర్లకు అవకాశం దక్కలేదు. బంతి పాతబడిన తర్వాత శ్రేయస్‌ అయ్యర్ (29*), రవిచంద్రన్ అశ్విన్‌ (42*) బంగ్లా బౌలింగ్‌పై ఎదురు దాడి చేశారు. దీంతో అప్పటి వరకు అద్భుతంగా వేసిన బంగ్లా బౌలర్లు దిక్కుతోచని పరిస్థితికి వెళ్లిపోయారు. క్రీజ్‌లో పాతుకుపోవడం ఎంత ముఖ్యమో.. సందర్భానుసారంగా ఆటడమూ అంతే ముఖ్యమని చెప్పడానికి ఇదో ఉదాహరణ.

భారత్​ గెలుపు

కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే..
భారత క్రికెట్‌ జట్టులో ప్రక్షాళనకు సమయం ఆసన్నమైందనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. ఫామ్‌లోకి వచ్చిన యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఎంతటి సీనియర్‌ను అయినా సరే పక్కన పెట్టాలి. ఈ క్రమంలోనే చాలా రోజులుగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కేఎల్‌ రాహుల్‌ను తప్పించాలనే డిమాండ్లూ వచ్చాయి. ఇప్పటికైనా ప్రయోగాలు ఆపి.. జట్టును పటిష్ఠంగా తయారు చేయడంపై ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దృష్టిసారించాలి. మరో ప్లేయర్‌ను జట్టులోకి తీసుకొచ్చేందుకు ఉత్తమంగా ఆడే ఆటగాళ్లను బెంచ్‌కు పరిమితం చేయడం సరైంది కాదు. దీనికి ఉదాహరణగా తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన కుల్‌దీప్‌కు రెండో మ్యాచ్‌లో స్థానం లేకపోవడాన్ని పలువురు మాజీలు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

భారత్​ గెలుపు

ABOUT THE AUTHOR

...view details