భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. ఆదివారం నాటకీయ మలుపులు తిరుగుతూ.. ఉత్కంఠ రేపిన రెండో టీ20లో ఆస్ట్రేలియాను సూపర్ ఓవర్లో ఓడించింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' స్మృతి మంధాన (79; 49 బంతుల్లో 9×4, 4×6) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మొదట మ్యాచ్‌లో, ఆ తర్వాత సూపర్ ఓవర్లో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది. బెత్ మూనీ (82 నాటౌట్; 54 బంతుల్లో 13×4), తాలియా మెక్‌గ్రాత్ (70 నాటౌట్; 51 బంతుల్లో 10×4, 1×6) రెండో వికెట్‌కు అభేద్యంగా 158 పరుగులు జోడించారు.
అనంతరం ఛేదనలో భారత్ కూడా 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులే చేసింది. స్మృతి, షెఫాలి (34) తొలి వికెట్‌కు 76 పరుగులు జతచేసి బలమైన పునాది వేశారు. కానీ వరుస ఓవర్లలో షెఫాలి, జెమీమా (4) ఔటవడంతో ఇన్నింగ్స్ కుదుపునకు గురైంది. ఆ దశలో కెప్టెన్ హర్మన్ (22 బంతుల్లో 21) నిలబడగా.. మంధాన బౌండరీలతో చెలరేగింది. ఫోర్లు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన హర్మన్ పెవిలియన్ చేరడంతో 16 ఓవర్లకు జట్టు 142/3తో నిలిచింది. విజయానికి 4 ఓవర్లలో 46 పరుగులు కావాల్సి వచ్చాయి.
ఆ తర్వాతి ఓవర్లో ఓ సిక్సర్ కొట్టిన వెంటనే మంధాన బౌల్డయింది. దీంతో మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి. కానీ రిచా ఘోష్ (26 నాటౌట్; 13 బంతుల్లో 3×6) సిక్సర్లతో విరుచుకుపడి జట్టును రేసులో నిలిపింది. 18వ ఓవర్లో ఆమె రెండు సిక్సర్లు కొట్టడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18గా మారింది. కానీ 19వ ఓవర్లో గొప్పగా బౌలింగ్ చేసిన హీదర్ (3/22).. దీప్తి (2)ని ఔట్ చేయడంతో పాటు కేవలం నాలుగు పరుగులే ఇచ్చింది. దీంతో టీమ్‌ఇండియా విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. యువ ఆల్‌రౌండర్ దేవిక (11 నాటౌట్; 5 బంతుల్లో 2×4) తీవ్ర ఒత్తిడిలోనూ ఉత్తమంగా బ్యాటింగ్ చేసింది. తొలి బంతికి రిచా సింగిల్ తీయగా.. రెండో బంతికి దేవిక ఫోర్ కొట్టింది. ఆ తర్వాత మూడు బంతుల్లో నాలుగు పరుగులే రావడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాలి. ఆ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫోర్‌గా మలచిన దేవిక మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మళ్లించింది.