ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి పరాజయాన్ని చవి చూసిన టీమ్ఇండియా.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు సిద్దమవుతోంది. తమ తప్పిదాలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన రోహిత్ సేన.. అహ్మదాబాద్ వేదికగా గురువారం(మార్చి 9) నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్టుకు సన్నద్ధమవుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్‌కు చేరాలంటే..ఈ మ్యాచ్ గెలవడం టీమ్ఇండియాకు తప్పనిసరి. మరోవైపు సమష్టి ప్రదర్శనతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో విజయం అందుకున్న ఆసీస్ అదే జోరులో అహ్మదాబాద్ టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాలనుకుంటుంది.
విన్నింగ్ కాంబినేషన్‌ను కాదని రెండు మార్పులతో ఇందౌర్ టెస్ట్ బరిలోకి దిగిన టీమ్ఇండియా భారీ మూల్యం చెల్లించుకుంది. కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ సైతం పేలవ ప్రదర్శన కనబర్చాడు. మహమ్మద్ షమీ స్థానంలో బరిలోకి దిగిన ఉమేశ్ యాదవ్ మాత్రం బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. దాంతో అతడు చివరి టెస్ట్‌లోనూ అవకాశం అందుకోనున్నాడు.
మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడో టెస్ట్ నుంచి మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వగా.. అతడు ఆఖరి టెస్ట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అప్పుడు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. టర్నింగ్ ట్రాక్స్ కావడంతో గత మూడు మ్యాచ్‌ల్లో సిరాజ్ ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క వికెట్ తీశాడు. దాంతో సిరాజ్‌ను ఆఖరి టెస్ట్‌కు పక్కనపెట్టనున్నారు.
పేలవ ఫామ్‌తో విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌ను కాదని శుభ్‌మన్ గిల్‌ను ఆడిస్తే అతడు దారుణంగా విఫలమయ్యాడు. అయితే అతడికి మరో అవకాశం ఇవ్వనున్నారు. దాంతో కేఎల్ రాహుల్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే కీపింగ్‌లో ఆకట్టుకుంటున్నా.. బ్యాటింగ్‌లో తడబడుతున్న కేఎస్ భరత్ స్థానంలో రాహుల్‌ను ఆడించాలనుకుంటే మాత్రం తెలుగు ప్లేయర్‌పై వేటు పడనుంది. కీపింగ్‌కే ప్రాధాన్యత ఇస్తే మాత్రం కేఎస్ భరత్ జట్టులో కొనసాగుతాడు. మూడో టెస్ట్‌లో పుజారా, అయ్యర్ పర్వాలేదనిపించినా.. కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లీకి చివరి టెస్ట్ కీలకంగా మారింది. తొలి రెండు టెస్ట్‌ల్లో సత్తా చాటిన జడేజా ఇందౌర్‌లో మాత్రం తేలిపోయాడు.
బౌలింగ్ విభాగంలోనూ టీమ్ఇండియా పెద్దగా మార్పులు చేసే ఛాన్సే లేదు. అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్‌లో కీలకం కాగా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు లోయరార్డర్‌లో కీలక పరుగులు చేస్తుండటంతో ఈ ముగ్గురిని జట్టులో తప్పకుండా కొనసాగించనున్నారు. అహ్మదాబాద్‌లో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ పరంగా మంచి రికార్డు ఉంది. దాంతో టీమ్ఇండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అశ్విన్ ఏమైనా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటే మాత్రం కుల్దీప్ జట్టులోకి వస్తాడు. మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు ఎవరైనా గాయపడితే బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుంది..
తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్/ఉమేశ్ యాదవ్