బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్ గెలుచుకున్న టీమ్ఇండియా మంచి జోష్ మీద ఉంది. శుక్రవారం.. మంబయిలోని వాంఖడే వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ క్రికెట్ జట్టు బౌలర్లు విజృంభించారు. 35.4 ఓవర్లలోనే 188 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్(81) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్, హార్దిక్, తలా వికెట్ సాధించారు.
విజృంభించిన టీమ్ఇండియా బౌలర్లు.. ఆసీస్ ఆలౌట్ - టీమ్ఇండియా ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్ఇండియా బౌలర్లు విజృంభించారు. 35.4 ఓవర్లలోనే 188 పరుగులకే ఆసీస్ ఆలౌటైంది. సిరాజ్, షమీ తలో మూడు వికెట్లు తీశారు.
టాస్ నెగ్గి భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు సహకరించినట్లు అనిపించిన పిచ్.. మ్యాచ్ జరిగే కొద్దీ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. బౌలింగ్ ప్రారంభించిన భారత్‌కు రెండో ఓవర్‌లోనే వికెట్ దక్కింది. అయితే ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (22)తో కలిసి మిచెల్ మార్ష్ (81) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. స్మిత్ ఔటైనప్పటికీ.. లబుషేన్ (15), జోష్ ఇంగ్లిస్ (26)తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే 128/2 స్కోరుతో ఉన్న ఆసీస్.. భారత బౌలర్ల దెబ్బకు 60 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లను కోల్పోవడం విశేషం. సిరాజ్, షమీ తమ రెండో స్పెల్‌లో నిలకడగా వికెట్లు తీసి ఆసీస్‌పై ఒత్తిడి పెంచారు.
అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ..
సూపర్‌స్టార్ రజనీకాంత్ ముంబయిలోని వాంఖడే వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు హాజరయ్యారు. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రజనీని గతంలో చాలా మంది క్రికెటర్లు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇటీవలే టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెన్నైలో రజినీకాంత్‌ని ప్రత్యేకంగా కలిశాడు. గతంలో ధోనీ కూడా సూపర్ స్టార్‌ని కలిసి చాలా సేపు ముచ్చటించాడు. ఇక క్రికెట్‌పై ఆయనకున్న అభిమానం ఇవాళ వాంఖడే స్టేడియానికి రప్పించిందని ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ పేర్కొన్నాడు. ''వాంఖడే స్టేడియానికి వచ్చి తొలి వన్డే మ్యాచ్ చూడాలని లెజెండరీ యాక్టర్ రజినీకాంత్‌ను ఆహ్వానించా. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించారు. చాలా రోజుల తర్వాత వాంఖడేలో సూపర్ స్టార్ అడుగుపెట్టారు'' అని అమోల్ ఖేల్ చెప్పుకొచ్చారు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్‌పై రజినీకాంత్ కనిపించగానే స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. వీఐపీ గ్యాలరీలో కూర్చుని రజనీకాంత్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.