India Vs Australia Second T20 2023 : రాయ్‌పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో 20 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మొదటి నుంచే తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (31) ఫర్వాలేదనిపించినా.. జాష్ ఫిలిప్ (8) తేలిపోయాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ మెక్‌డెర్మాట్ (19), ఆరోన్ హార్డీ (8), టిమ్ డేవిడ్ (19) ఆశించినంత ప్రదర్శన చేయలేదు. మాథ్యూ షార్ట్ (22), మాథ్యూ వేడ్ (36*) పరుగులతో స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. బెన్ డ్వార్షుయిస్ (1), క్రిస్ గ్రీన్ (2) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ల పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32) ఫర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (8), సుర్యూ కుమార్ యాదవ్ (1) నిరాశపరిచారు. ఇక అప్పుడు క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ (46) దూకుడుగా ఆడి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. జితేశ్ శర్మ (35) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లు బెన్ డ్వార్షుయిస్ 3, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్ 2, తన్వీర్ సంఘా 2, ఆరోన్ హార్డి ఒక వికెట్ తీశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా మూడు మ్యాచ్‌లు గెలిచింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు నమోదు చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఓడి హ్యాట్రిక్ మిస్ చేసుకుంది.