India Vs Australia 3rd T20 2023 : ఐదు మ్యాచ్‌ల టీ20 సరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆసీస్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట తడబడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (35) ఫర్వాలేదనిపించినా.. అరోన్ హార్డీ (16) నిరాశ పరిచాడు. వన్‌డౌన్ దిగిన జోష్ ఇంగ్లిస్ (10) కూడా పేలవ ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (104*) విశ్వరూపం చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయిదే అతడికి మార్కస్ స్టాయినిస్ (17) మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నించాడు. కానీ అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ (0) డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి దిగిన కెప్టెన్ మాథ్యూ వేడ్ (28*) మ్యాక్స్‌వెల్‌తో కలిసి చివరి వరకు పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
కొంపముంచిన చివరి ఓవర్..
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 20వ ఓవర్ టీమ్ఇండియా కొంపముంచింది. ఓవర్లో రెండో బంతి సింగిల్ మినహా.. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. (4, 1, 6, 4, 4, 4 )