ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా.. భారత్ 262 పరుగులు చేసింది. దీంతో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా (7/42), రవిచంద్రన్ అశ్విన్ (3/59) ఆసీస్‌కు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్‌లో జడేజా 110 పరుగులు ఇచ్చి పది వికెట్లు పడగొట్టాడు. ఇవే టెస్టుల్లో అతడి అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.
ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడ్డూ.. టీమ్ఇండియాదే రెండో టెస్ట్ - రెండో టెస్టులో భారత్ విజయం
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్ 2-0 ఆధిక్యంతో దూసుకెళ్లింది. రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసీస్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (1) కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ (31) దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ఛెతేశ్వర్ పుజారా (31*)తో జరిగిన సమన్వయలోపంతో రోహిత్ రనౌట్ అయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (20)తో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే మర్ఫీ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన కోహ్లీ స్టంపౌట్ అయిపోయాడు. ఇలా విరాట్ తన టెస్టు కెరీర్‌లో (180 ఇన్నింగ్స్‌ల్లో) తొలిసారి స్టంపౌట్ కావడం గమనార్హం. ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 25వేల పరుగులను పూర్తి చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ (12) వేగంగా ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. దూకుడుగా ఆడిన శ్రీకర్ భరత్ (23*)తో కలిసి మరో వికెట్ పడనీయకుండా పుజారా జట్టును విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్ కూడా పుజారాదే కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన బాధలో ఉన్న పుజారాకు మ్యాచ్ విజయం ఊరటనిచ్చింది. ఆసీస్ బౌలర్లు లయన్ 2, మర్ఫీ ఒక వికెట్ తీశారు.