భారత్ గెలుపుతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ముగిసింది. ఇక ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది. వీటి మధ్యలోనే వన్డే పోరులో ఆసీస్‌తో తలపడనుంది రోహిత్ సేన. వాంఖడే వేదికగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. అయితే టీమ్ఇండియా దృష్టంతా ఇప్పుడు వన్డే ప్రపంచకప్ పైనే ఉంది. 2011లో భారత్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చినప్పుడు ధోనీ సేన ఆ కప్పు గెలిచింది. ఈ క్రమంలో రానున్న ప్రపంచ కప్‌ను కూడా తాము సాధించాలని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది టీమ్ఇండియా. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఈ తొలి వన్డే ఓ పరీక్షగా నిలవనుంది. కుటుంబ కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌కు దూరం కాగా.. ఇప్పుడు ఆ బాధ్యతలను హార్దిక్ తీసుకున్నాడు. ఈ సిరీస్‌కు అతను వైస్ కెప్టెన్. ఈ వన్డే జోరును అందుకోవడమనేది ఇరు జట్లకు సవాలుతో కూడిన విషయమే. కానీ ఈ సిరీస్ ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో భాగం కాదు.
వన్డే ఫార్మాట్లతో ఈ ఏడాదికి శుభరంభం పలికిన టీమ్ఇండియా ఇక రానున్న మ్యాచ్‌లకు అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ న్యూజిలాండ్, శ్రీలంకలతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్‌దే పై చేయిగా నిలిచింది. అంతే కాకుండా ఇప్పుడు యువ ప్లేయర్ శుభ్‌మన్ ఫామ్ టీమ్ఇండియాకు బాగా కలిసొచ్చే అంశం. ఇది వరకు జరిగిన ఆరు వన్డేల్లో అతడు 113.40 సగటుతో ఏకంగా 567 పరుగులు సాధించాడు. రోహిత్ లేని సమయంలో గిల్ ఇప్పుడు అభిమానులను మరింతగా ఆకర్షించనున్నాడు. కాగా అహ్మదాబాద్ టెస్టులో బాదిన శతకంతో ఇంకాస్త జోరు పెంచాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ మోస్తరుగా ఆడాడు. ఆరు మ్యాచ్‌ల్లోనూ 67.60 సగటుతో 338 పరుగులను స్కోర్ చేశాడు. ఫామ్‌లో ఉన్న కోహ్లీ కూడా మరిన్ని పరుగులు సాధించి జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నారు. ఇక ఆసీస్ స్పిన్నర్ అడమ్ జంపాతో కోహ్లీ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. విరాట్ బ్యాటింగ్‌కు అతడు గతంలో మెరుగ్గానే బౌలింగ్ వేశాడు.