India Vs Afghanistan 3rd T20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయ కేతనం ఎగురవేసింది. ఉత్కంఠంగా జరిగిన ఈ పోరులో భారత జట్టు రెండో సూపర్ ఓవర్లో అఫ్గాన్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రోహిత్ శర్మ (121 నాటౌట్); రింకు సింగ్ (69 నాటౌట్) మైదానంలో చెలరేగడం వల్ల మొదట టీమ్ఇండియా 4 వికెట్లకు 212 పరుగులు స్కోర్ చేసింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్ జట్టు కూడా దూకుడుగానే ఆడింది. అలా ఆ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులే చేసింది. దీంతో ఆట కాస్త డ్రాగా మారి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
అందులో మొదట అఫ్గాన్ జట్టు 16 పరుగులు చేయగా, టీమ్ఇండియా కూడా అన్నే పరుగులు సాధించడం వల్ల మ్యాచ్‌కు రెండో సూపర్ ఓవర్ తప్పలేదు. అయితే రెండో సూపర్ ఓవర్లో తొలుత భారత్ 11 పరుగులే చేయడం వల్ల ఇక గెలుపు కష్టమే అని అనుకున్నారంతా! కానీ రవి బిష్ణోయ్ అద్భుతమైన బౌలింగ్ వల్ల కేవలం మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో విజయం టీమ్ఇండియాను వరించింది.
రో'హిట్' అదుర్స్
ప్రపంచకప్ నేపథ్యంలో టీ20ల్లోకి (ఈ సిరీస్‌తో) పునరాగమనం చేసిన ఈ స్టార్ క్రికెటర్ తొలి రెండు మ్యాచుల్లో డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో అటు ఫామ్‌తో పాటు ఇటు కెప్టెన్సీ విషయంలో రోహిత్ అనేక విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే మూడో టీ20లో అన్ని ప్రశ్నలకూ తన బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. టీ20 క్రికెట్లో అయిదో శతకాన్ని బాది తనలో హిట్‌మ్యాన్ ఇంకా అలాగే ఉన్నాడని సత్తా చాటాడు. అదిరే ఇన్నింగ్స్‌ను అందించి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు.