India Vs Afghanistan 1st T20 :ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు గురువారం మొహాలీ వేదికగా తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. 14 నెలల గ్యాప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి రావడం వల్ల అందరి దృష్టి వారిపైనే ఉంది. ఈ సిరీస్‌కు వారిని ఎంపిక చేయడం ద్వారా టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో వారు ఉంటారంటూ సెలక్టర్లు సంకేతాలు ఇచ్చారు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ టీమ్ఇండియాకు దూరమయ్యారు. దీంతో రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను శుభమన్ గిల్ లేదా యశస్వీ జైశ్వాల్ ఆరంభించే అవకాశం ఉంది.
సౌతాణాఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించని శుభమన్ గిల్ అఫ్గానిస్థాన్ సత్తా చాటడం ద్వారా తిరిగి గాడిలో పడాలని కోరుకుంటున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో రింకూ సింగ్ కీలకం కానున్నాడు. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కింద శివమ్ దుబే, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ల కింద అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అర్షదీప్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కులదీప్ యాదవ్ లేదా రవి బిష్ణోయ్‌కు తుది జట్టులో స్థానం దక్కవచ్చు.