తెలంగాణ

telangana

ETV Bharat / sports

India under 19: అండర్-19 కుర్రాళ్లు.. భవిష్యత్​ తారలు - raj bawa

నూనూగు మీసాల కుర్రాళ్లు.. వాళ్లవి వేర్వేరు ప్రాంతాలు.. విభిన్న నేపథ్యాలు. కథలు వేరైనా.. వాళ్ల కల మాత్రం ఒకటే. అందు కోసం ఒకటిగా కలిశారు. ఒక్కో సవాలును దాటుకుంటూ సమష్టిగా ముందుకు సాగారు. చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. వాళ్లే.. భారత అండర్‌-19 కుర్రాళ్లు. అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్‌ అందుకున్న ఛాంపియన్లు. బలమైన ప్రత్యర్థులను దాటి.. ప్రతికూల పరిస్థితులను వెనక్కినెట్టి.. విజేతలుగా నిలిచిన వీరులు. భారత క్రికెట్‌ భవిష్యత్‌ తారలు.

india under 19 world cup 2022
టీమ్​ఇండియా అండర్-19

By

Published : Feb 7, 2022, 6:31 AM IST

ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలతో అండర్‌-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన యువ భారత్‌ అదరగొట్టింది. ఐదో సారి కప్పును ముద్దాడి టోర్నీలో దేశ ఘన వారసత్వాన్ని కొనసాగించింది. యశ్‌ ధుల్‌ సారథ్యంలోని జట్టు టోర్నీ సాంతం ఆధిపత్యం ప్రదర్శించింది. గ్రూప్‌- బిలో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా ముందడుగు వేసిన భారత్‌.. క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్లోనూ అద్వితీయమైన ఆటతో అబ్బురపరిచింది. ముఖ్యంగా కుర్రాళ్ల సమష్టితత్వం, పోరాట పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. మధ్యలో కరోనా దెబ్బ కొట్టినా.. జట్టు లోతైన బ్యాటింగ్‌ బలం, క్రమం తప్పకుండా వికెట్లు తీసిన బౌలింగ్‌ దళం కలిసి జట్టును నడిపాయి. మరోవైపు జట్టు విజయంలో జాతీయ అకాడమీ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జట్టుతో పాటే వెస్టిండీస్‌ వెళ్లిన అతను తన అనుభవాలను కుర్రాళ్లతో పంచుకుంటూ స్ఫూర్తి కలిగించాడు. కొవిడ్‌ సోకిన ఆటగాళ్లలో మానసిక స్థైర్యాన్ని నింపాడు. తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా ఎప్పటికప్పుడూ ఆటగాళ్లను గమనిస్తూ మంచి ప్రదర్శన చేసేలా చూశాడు.

ఆ లోటు తీర్చేలా..

గత కొన్నేళ్లుగా నిఖార్సైన పేస్‌ ఆల్‌రౌండర్‌ కోసం టీమ్‌ఇండియా ఎదురుచూస్తోంది. మధ్యలో హార్దిక్‌ పాండ్య వచ్చి ఆశలు రేపినా.. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత అతను లయ తప్పాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ సైతం అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత పేస్‌ ఆల్‌రౌండర్ల ప్రదర్శన ఆశాజనకంగా కనిపిస్తోంది. రాజ్‌ బవా, రాజ్‌వర్ధన్‌ హంగర్గేకర్‌.. ఫాస్ట్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్రీడా కుటుంబం నుంచి వచ్చిన 19 ఏళ్ల రాజ్‌.. లెఫ్టార్మ్‌ బ్యాటింగ్‌తో, రైటార్మ్‌ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. ఫైనల్లో 5 వికెట్లతో పాటు 35 పరుగులు చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేయడం సహా 9 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలోనే ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా అతడికి పేరొచ్చింది. మరోవైపు కొత్త బంతితో కొన్ని మ్యాచ్‌ల్లో భారత్‌కు చక్కటి ఆరంభాన్నిచ్చిన హంగార్గేకర్‌.. చివరి ఓవర్లలో మెరుపు హిట్టింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. అతడిలో మంచి వేగం ఉంది. ప్రధాన బ్యాట్స్‌మన్‌కు దీటుగా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం అతడిలో కనిపిస్తోంది.

.

ఆ ఇద్దరిపై భారీ అంచనాలే..

ఓపెనర్లు రాణిస్తేనే జట్టు మంచి స్థితిలో నిలవడం లేదంటే ఓటమి దిశగా సాగడం.. ఇదీ ఇటీవల టీమ్‌ఇండియా తీరు! కానీ అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌కు ఆ సమస్యే కలగలేదు. అందుకు కారణం కెప్టెన్‌ యశ్‌, గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌. 3వ స్థానంలో వైస్‌కెప్టెన్‌ రషీద్‌ (4 మ్యాచ్‌ల్లో 50.25 సగటుతో 201 పరుగులు), 4వ స్థానంలో యశ్‌ (4 మ్యాచ్‌ల్లో 76.33 సగటుతో 229) గొప్పగా రాణించారు.

.

టోర్నీలో తొలి మ్యాచ్‌ తర్వాత కరోనా కారణంగా తర్వాతి రెండు మ్యాచ్‌లకు వీళ్లు దూరమయ్యారు. ఆత్మవిశ్వాసంతో దాని నుంచి కోలుకుని ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండా క్వార్టర్స్‌లో నేరుగా బరిలో దిగినా తిరిగి లయ అందుకున్నారు. సెమీస్‌లో మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ మ్యాచ్‌లో యశ్‌ శతకం చేయగా.. రషీద్‌ 94 పరుగులు చేశారు. ఫైనల్లో రషీద్‌ కీలక అర్ధశతకంతో ఛేదన సాఫీగా సాగేలా చూశాడు. రషీద్‌, యశ్‌ కచ్చితంగా టీమ్‌ఇండియాకు ఆడగలరనే అంచనాలున్నాయి. వీరిపై ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు కన్నేసి ఉండొచ్చు. ఈ టోర్నీలో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌ రఘువంశీ (278 పరుగులు)కి మంచి భవిష్యతే కనిపిస్తోంది. అతను పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గానూ ఉపయోగపడగలడు. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్‌ విక్కీ (12 వికెట్లు) కూడా ఆకట్టుకున్నాడు. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ బనా ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు. ఫైనల్లో అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ నిషాంత్‌ పైనా మంచి అంచనాలున్నాయి. యశ్‌ ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కెప్టెన్‌గా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుంటూ రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ తర్వాత అతను కూడా కొవిడ్‌ బారిన పడి కోలుకున్నాడు.

ఇప్పుడే మొదలు..

.

కుర్రాళ్లకు అసలైన పరీక్ష ఇప్పుడే మొదలు కానుంది. సీనియర్‌ జట్టు తలుపు తట్టాలంటే వచ్చే కొన్నేళ్లు వీళ్లకు చాలా కీలకం. నిలకడగా ఈ ప్రదర్శన కొనసాగిస్తేనే టీమ్‌ఇండియాలోకి వస్తారు. గతంలోనూ అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించి కనుమరుగైన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. బాబా అపరాజిత్‌, విజయ్‌ జోల్‌, రికీ భుయ్‌, ఉన్ముక్త్‌ చంద్‌, మన్‌జోత్‌ కల్రా, ప్రియమ్‌ గార్గ్‌.. ఇలా కొంతమంది ఆటగాళ్లు అండర్‌-19 ప్రపంచకప్‌ల్లో అదరగొట్టినా., ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయారు. మరోవైపు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, కోహ్లి, జడేజా, పంత్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌.. ఇలా జూనియర్‌ స్థాయి నుంచి సీనియర్‌ జట్టుకు విజయవంతంగా ఎదిగిన క్రికెటర్లూ ఉన్నారు. కాబట్టి ఈ కుర్రాళ్లను సరైన దిశలో నడిపించడంపై ఇప్పుడు బీసీసీఐ ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. ప్రస్తుతానికి వచ్చే ఐపీఎల్‌ వేలంలో ఈ ప్రపంచకప్‌ హీరోలకు మంచి డిమాండ్‌ ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ ఒక్కసారిగా వచ్చే పేరుతో ఒత్తిడికి గురి కాకుండా నిలకడగా రాణిస్తేనే సీనియర్‌ జట్టుకు చేరుకోగలరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details