ఇటీవలే ఐసీసీ(International Cricket Council) మెగాటోర్నీలకు సంబంధించిన వేదికల్ని ప్రకటించింది. ఇందులో 2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ(champions trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపింది. అయితే చాలాకాలంగా భారత్-పాకిస్థాన్(india vs pakistan match) మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగట్లేదు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్లో పర్యటించడానికి విముఖత వ్యక్తం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో మరో నాలుగేళ్లలో పాక్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా అక్కడకు వెళ్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. ఇదే విషయమై స్పందించిన ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే.. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడం అతి పెద్ద సవాలుతో కూడుకున్నదని తెలిపాడు.
"అవును. పాక్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడమనేది సవాలుతో కూడుకున్న విషయం. భౌగోళిక, రాజకీయ విషయాలను నేను అదుపు చేయలేను. కానీ రెండు దేశాల మధ్య సత్సంబంధాల్ని పెంపొందించడానికి క్రికెట్ దోహదపడుతుందని భావిస్తున్నా. ప్రజలు, దేశాలు ఒకేతాటిపై నిలవడానికి క్రీడలు చేసే అత్యంత గొప్ప సాయమిది. అదే జరిగితే అద్భుతమే."