ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తనని ఎంపిక చేయకపోవడంపై టీమ్‌ఇండియా మణికట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ బాధపడ్డాడని.. అతని చిన్ననాటి కోచ్ కపిల్ దేవ్ పాండే తెలిపారు. అయినా దాని గురించి మర్చిపోయి శ్రీలంక పర్యటనపై దృష్టి సారించాడని పేర్కొన్నారు. తాజాగా లంక పర్యటనకు సంబంధించి బీసీసీఐ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్ల బృందాన్ని ఎంపిక చేసింది. అందులో కుల్దీప్కు కూడా చోటు దక్కింది.
"కుల్‌దీప్ బౌలింగ్‌లో గూగ్లీ బంతులే ప్రధాన అస్త్రాలు. ఆ బంతులు ఎప్పుడూ అతడికి వికెట్లు దక్కేలా చేసేవి. అయితే, ఇటీవలి కాలంలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏదో ఒక బంతి సరైన లెంగ్త్‌లో పడటం తప్ప మిగతావన్నీ ఎక్కడెక్కడో పిచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజులుగా తన బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించాడు. బాగా సాధన చేసి సరైన లెంగ్త్‌తో ఇప్పుడు బంతులు వేయగలుగుతున్నాడు. అతడు వికెట్ టేకర్‌గా ఉంటూ చాలా పొదుపుగా బౌలింగ్ చేసేవాడు. అయితే, ఇప్పుడు తన అమ్ముల పొదిలో మరో అస్త్రాన్ని జోడించాలని నిర్ణయించుకున్నాడు. మధ్య ఓవర్లలో పరుగుల్ని నియంత్రించాలనుకుంటున్నాడు" అని పాండే వివరించారు.
ఇదీ చదవండి:Shikhar Dhawan: 'కెప్టెన్సీని గొప్పగా భావిస్తున్నా'