ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్టే తీసినా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 19.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 73 పరుగులు ఇచ్చాడు. చక్కని లెంగ్తుల్లో, క్రమశిక్షణతో బంతులు విసిరాడు. అనవసర పొరపాట్లకు తావివ్వలేదు.
కీలకమైన లబుషేన్, స్టీవ్‌స్మిత్, కామెరాన్ గ్రీన్‌లతో పాటు టెయిలెండర్లు మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఈ సిరీసులోనే అరంగేట్రం చేసినప్పటికీ టీమ్‌ఇండియా బౌలింగ్‌కు నాయకత్వం వహించడం విశేషం. షమి, బుమ్రా, ఉమేశ్ స్థానాల్లో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్, నటరాజన్‌కు మెలకువలు చెబుతూ ప్రోత్సహించాడు.
ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించిన సిరాజ్‌పై ప్రస్తుతం అభినందనల వెల్లువ కొనసాగుతోంది. తొలి టెస్టు సిరీసులోనే సిరాజ్ బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. ముందుండి నడిపించాడు. ఈ సిరీసులో కొత్తవాళ్ల ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐదు వికెట్లు తీసిన సిరాజ్ ఇక ఎంత మాత్రం కుర్రాడు కాదు.