మెల్బోర్న్లో శనివారం(డిసెంబర్ 26) ప్రారంభమయ్యే భారత్-ఆస్ట్రేలియా 'బాక్సింగ్ డే' టెస్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ను బాక్సింగ్ డే టెస్టు అని ఎందుకు పిలుస్తారు? దాని వెనుకున్న కథేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అలా వచ్చిందా పేరు..
డిసెంబర్ 26కు, బాక్సింగ్ క్రీడకూ ఏ సంబంధమూ లేదు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో క్రిస్మస్ తర్వాతి రోజున అందరూ తమ బంధవులను, స్నేహితులను కలిసి బహుమతుల బాక్సులను అందజేస్తారు. పండగ ముగిసిన తర్వాత రోజు అంటే డిసెంబరు 26న తమ వద్ద పనిచేసే వారందరికి యజమానులు సెలవు ఇచ్చి, వారికి కానుకలను అందజేస్తారు. అలా క్రిస్మస్ ముగిసిన తర్వాతి రోజున అందరూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ.. వారికి వచ్చిన బహుమతి బాక్సులను పరిశీలిస్తారు. అలా ఆ రోజును 'బాక్సింగ్ డే'గా పిలవడం ప్రారంభించారు.
ఇదీ చరిత్ర..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మొదటిసారి 1950లో బాక్సింగ్ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత కూడా వివిధ దేశాలతో ఆస్ట్రేలియా, బాక్సింగ్ డే టెస్టుల్లో ఆడినప్పటికీ.. 1980 నుంచి ప్రతి ఏటా వరుసగా ఈ టెస్టుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.