భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపై ఆ దేశ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించారు. ప్రస్తుత ఓటమి ఫలితంగా రాబోయే రోజుల్లో జట్టులో భారీ మార్పులు జరగొచ్చని జోస్యం చెప్పారు. టీమ్‌లోని పలువురికి చోటు ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు.
ఆస్ట్రేలియా పూర్తిస్థాయి జట్టుపై భారత్ ద్వితీయ శ్రేణి ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఇండియాకు ఇదొక మధురమైన విజయం. నాలుగో టెస్ట్ విజయంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో ఎగురేసుకుపోయారు. ఈ ఓటమితో జట్టులో భారీ మార్పులు జరుగుతాయి. కొంత మంది ఆటగాళ్లు స్థానం కోల్పోయే అవకాశం ఉంది.
-షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్.
మొదటి టెస్ట్ గెలుపును కొనసాగించడంలో ఆసీస్ జట్టు విఫలమైందని వార్న్ అభిప్రాయపడ్డారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీని సొమ్ము చేసుకోలేకపోయారని. గాయాల కారణంగా చాలా మంది కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారని, టీమ్ఇండియాను చిత్తు చేయడానికి ఆస్ట్రేలియాకు చాలా అవకాశాలొచ్చాయన్నారు వార్న్. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు బౌలర్లు సమర్థంగా ఆడలేదని లెగ్ స్పిన్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
టిమ్ పైన్ కెప్టెన్సీ పైనా పలు విమర్శలు చేశారు వార్న్. 'మ్యాచ్ చివరి రోజు వ్యూహాలు పన్నడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో టిమ్ విఫలమయ్యాడు. కెప్టెన్, బౌలర్ల మధ్య సరైన సమన్వయం లేదు. మేము ఇలా బౌలింగ్ చేస్తామని బౌలర్లు కూడా బాధ్యత తీసుకోలేదు' అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'బలగాల రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహమే'