టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్థమంతమైన నాయకుడు అయినప్పటికీ.. కెప్టెన్సీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరముందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో చిన్న చిన్న మార్పులు చేసి, ఆటగాళ్లను స్థిరంగా తయారు చేయాలని సూచించాడు. శాశ్వత స్థానం దొరికినప్పుడే.. జట్టు సభ్యులు మరింత బాగా ఆడతారని అన్నాడు.
"కోహ్లీ తన ఆటతీరుతో ఇతర జట్ల సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కానీ, నాయకత్వం విషయంలో ఇంకా పురోగతి సాధించాలి. అందులో ప్రధానమైనది జట్టు సభ్యులను స్థిరంగా కొనసాగించడం. లైనప్‌ను తరుచూ మార్చితే ఆటగాళ్లు అభద్రతా భావానికి గురవుతారు. ఓ అనుభవజ్ఞుడి ఆటగాడిగా అది నాకు తెలుసు. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లయినా, కొత్త వాళ్లయినా స్థిరత్వం కావాలని ఆశిస్తారు. అలా ఉండడం వల్ల మరింత మెరుగ్గా ఆడుతారు"