1991-92 సీజన్‌లో తన తొలి ఆస్ట్రేలియా పర్యటన ఎంతో నేర్పిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆసీస్‌లో పర్యటిస్తోంది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోర పరాభవం పాలైన నేపథ్యంలో తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన సచిన్.. తన మొదటి పర్యటన టెక్నికల్ విషయాలపైనే కాకుండా మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పిందని చెప్పాడు.
"అప్పట్లో చాలా మంది పేస్, బౌన్స్ గురించి మాట్లాడేవారు, ఒక బౌలర్ అలా బంతులేయాలంటే కచ్చితమైన లెంగ్త్ అవసరం. దానికి ఆ బౌలర్ పిచ్ మీద నిర్దిష్టమైన ప్రాంతం కనుగొనాలి. కానీ, అదెంతో కష్టతరమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్ సానుకూల ధోరణితో ముందుకు సాగితే పరుగులు చేయడానికి చాలా అవకాశాలుంటాయి. నేను అలానే చేసేవాడిని. మొదట్లో నేను కూడా బంతిపై ప్రతాపం చూపేవాడిని, సమయం గడిచేకొద్దీ నా పరిణతి పెరిగింది. ఎప్పుడూ బంతిపై ఎదురుదాడి చేయడం కాకుండా, పరిస్థితులను అర్థం చేసుకొని బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. పేస్‌ను బట్టి షాట్లను ఎంపిక చేసుకోవాలి. ఒక్కోసారి ఆ షాట్లు కుదరకపోయినా అలాగే ప్రయత్నించేవాడిని."