తెలంగాణ

telangana

ETV Bharat / sports

పింక్​ టెస్ట్​ గురించి బోర్డర్​, గావస్కర్​ ఏమన్నారంటే?

గురువారం నుంచే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సమరం. అడిలైడ్‌లో గులాబి బంతి పోరు(డేనైట్‌)తో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీకి తెరలేవనుంది. తుది జట్లపై, ఆటగాళ్లపై ఎన్నో అంచనాలు, ఎన్నో విశ్లేషణలు..! మరి తమ పేరిటే జరుగుతున్న సిరీస్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌.. ఆసీస్‌ మేటి అలన్‌ బోర్డర్‌ ఏమంటున్నారో చూద్దాం.

sunil gavaskar and allan border about pink test match
పింక్​ టెస్ట్​ గురించి బోర్డర్​, గావస్కర్​ ఏమంటున్నారంటే..!

By

Published : Dec 16, 2020, 7:00 AM IST

Updated : Dec 16, 2020, 9:50 AM IST

ఆస్ట్రేలియాతో తొలిటెస్టులో పేసర్లతో టీమ్​ఇండియా బరిలోకి దిగనుంది కాబట్టి.. తుదిజట్టులో పంత్​నే ఎంపిక చేస్తారని భారత క్రికెట్​ దిగ్గజం సునీల్​ గావస్కర్​ అభిప్రాయపడ్డారు. ఆసిస్​-ఎతో జరిగిన సన్నాహక మ్యాచ్​లో గిల్​ ప్రదర్శన తనను ఆకట్టుకుందని అన్నారు.

"తుదిజట్టు ఎంపిక టీమ్‌ఇండియాకు అతిపెద్ద సవాల్‌. నాలుగేళ్ల క్రితం టెస్టు సిరీస్‌లో 4 మ్యాచ్‌ల్లోనూ పంత్ ఆ​డాడు. సెంచరీ సాధించడం సహా వికెట్ల వెనుక బాగానే రాణించాడు. కొన్ని రోజుల క్రితమే సెంచరీ సాధించిన ఆటగాడే జట్టు మేనేజ్‌మెంట్‌కు మొదటి ప్రాధాన్యం అవుతాడని నా అభిప్రాయం. బంతి తిరిగే స్పిన్‌ పిచ్‌లపై వికెట్‌ కీపర్‌గా మెరుగైన నైపుణ్యమున్న సాహా మంచి ఎంపిక. కానీ టీమ్‌ఇండియా పేసర్లతో బరిలో దిగనుంది. కాబట్టి పంత్‌నే ఎంపిక చేస్తారని అనిపిస్తోంది. టాప్‌ఆర్డర్‌పై టీమ్‌ఇండియాలో స్పష్టత లేనట్లుంది. ఓపెనర్‌గా మయాంక్‌ ఉండటం ఖాయం. రెండో ఓపెనర్‌ ఎవరో? కొన్ని రోజులుగా సిడ్నీలో ఉన్నా. ఆసీస్‌-ఎతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ చూశా. గిల్‌ ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌లో అనిశ్చితి నేపథ్యంలో బ్యాటింగ్‌ను బలోపేతం చేసుకోడానికి పంత్‌ను ఆడించొచ్చు. పంత్‌ ఆరో స్థానంలో ఆడతాడు కాబట్టి అయిదుగురు బౌలర్లను తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. అప్పుడే 20 ఆసీస్‌ వికెట్లు తీయొచ్చు"

-- సునీల్​ గావస్కర్‌

ఫిట్​గా ఉంటేనే కీలకం..

ఫిట్​గా ఉంటేనే టీమ్​ఇండియా పేసర్​ బుమ్రా కీలకమవుతాడని ఆసిస్​ క్రికెట్​ దిగ్గజం అలన్​ బోర్డర్​ అభిప్రాయపడ్డారు. తొలి టెస్టు తర్వాత సారథి విరాట్​ కోహ్లీ గైర్హాజరీలో టీమ్​ఇండియా బ్యాటింగ్​ లైనప్​లో లోటు కనిపిస్తుందని అన్నారు.

"బుమ్రాకు నేను వీరాభిమానిని. అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే జట్టుకు విజయాలు అందించగలడు. ఆసీస్‌ పిచ్‌లపై బౌన్స్‌, స్వింగ్‌ లభిస్తాయి. టీమ్‌ఇండియా గెలవాలంటే బుమ్రా ఫిట్‌గా ఉండాలి. అప్పుడతను కీలకమవుతాడు. కిందటి సారి మాదిరే సత్తాచాటి ప్రధాన వికెట్లు తీయగలిగితే బుమ్రా ఇరుజట్ల మధ్య వ్యత్యాసం అవుతాడు. ఆసీస్‌ జట్టులో కామెరూన్‌ గ్రీన్‌ యువ ప్రతిభావంతుడు. అతడి బ్యాటింగ్‌లో మంచి టెక్నిక్‌ ఉంది. తొలి టెస్టు తర్వాత కెప్టెన్‌ కోహ్లి గైర్హాజరీలో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో లోటు కనిపిస్తుంది. కోహ్లి లేకపోవడాన్ని ఆసీస్‌ ఆస్వాదిస్తుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్‌లో సత్తాచాటి జట్టుకు విజయాన్ని అందించాలన్న పట్టుదల కోహ్లి ప్రదర్శిస్తాడు. అతడి లోటును భర్తీ చేయడం చాలా కష్టం. కోహ్లి గైర్హాజరీ ప్రభావం టీమ్‌ఇండియాపై ఎంతుంటుందో చూడాలి. వార్మప్‌ మ్యాచ్‌లో ఆకట్టుకున్న గిల్‌ను ఓపెనర్‌గా ఆడించాలి"

-- అలన్​ బోర్డర్​.

గురువారం జరగనున్న తొలిటెస్టు కోసం భారత్​, ఆస్ట్రేలియా జట్లు.. గెలుపే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి:పింక్​ టెస్ట్​కు ముందు భారత ఆటగాళ్ల సరదా డ్రిల్

Last Updated : Dec 16, 2020, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details