తెలంగాణ

telangana

ETV Bharat / sports

గాయాల నుంచి కోలుకున్న ఇషాంత్​, సాహా - ఇషాంత్​ శర్మ వార్తలు

టీమ్​ఇండియా క్రికెటర్లు వృద్ధిమాన్​ సాహా, ఇషాంత్​ శర్మ గాయాల బారి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సాహా తిరిగి సాధన మొదలు పెట్టగా.. బెంగళూరు ఎన్​సీఏ పునారావాసంలో ఉన్న ఇషాంత్​ పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ వార్త ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది.

Injury Rehab: Ishant Sharma starts bowling full tilt at NCA
గాయాల నుంచి కోలుకున్న ఇషాంత్​, సాహా

By

Published : Nov 19, 2020, 6:40 AM IST

ఆస్ట్రేలియా సిరీస్‌ ఆరంభానికి ముందు టీమ్‌ఇండియాకు ఉత్సాహాన్నిచ్చే వార్త. ఐపీఎల్‌లో గాయాలకు గురైన వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ దాదాపుగా కోలుకున్నట్లే. తొడ కండరాల గాయానికి గురైన టెస్టు వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తిరిగి సాధన మొదలెట్టగా.. ఇషాంత్‌ పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేశాడు.

ఐపీఎల్‌ నుంచి జట్టుతో పాటే సిడ్నీ చేరుకున్న వృద్ధిమాన్‌ బుధవారం నెట్స్‌లో కనిపించాడు. బౌలర్ల నుంచి త్రో డౌన్లను ఎదుర్కొన్నాడు. అయితే అతడు వికెట్‌ కీపింగ్‌ సాధన చేయలేదు. ఐపీఎల్‌ సందర్భంగా 36 ఏళ్ల సాహాకు తొడ కండరాల గాయమైంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు (డిసెంబరు 17-21) సమయానికి అతడు పూర్తిగా కోలుకుంటాడని భావిస్తున్నారు. సాహా ఇప్పటివరకు 37 టెస్టుల్లో 1238 పరుగులు చేశాడు.

బౌలింగ్​ వేస్తున్న ఇషాంత్​

పక్కటెముకల గాయంతో ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌ ఆడి స్వదేశానికి తిరిగొచ్చిన ఇషాంత్‌ శర్మ ఫిట్‌నెస్‌ సాధించినట్లే కనిపిస్తున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్న అతడు బుధవారం ఎన్‌సీఏ అధిపతి రాహుల్‌ ద్రవిడ్‌, ఫిజియో ఆశిష్‌ కౌశిక్‌, కోచింగ్‌ సిబ్బంది సమక్షంలో పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేశాడు. పూర్తిగా ఫిట్టయినట్లు ప్రకటిస్తే.. ఇషాంత్‌ ఆస్ట్రేలియా పయనమవుతాడు. ఆస్ట్రేలియాలో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో అతడు ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆసీస్‌లో ఇషాంత్‌ మూడు టెస్టులు ఆడగలిగితే కపిల్‌దేవ్‌ తర్వాత 100 టెస్టులు ఆడిన భారత రెండో ఫాస్ట్‌బౌలర్‌గా ఘనత సాధిస్తాడు. టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి అతడు మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details