తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరాజ్‌, గిల్‌కు అది ఎంతో స్పెషల్‌! - టీమ్​ఇండియా ఆటగాడు శుభ్​మన్​ గిల్​

బాక్సింగ్​ డే టెస్టులో టీమ్​ఇండియా ఆటగాళ్లు శుభ్​మన్​ గిల్​, మహ్మద్​ సిరాజ్​లకు.. జ్ఞాపకంగా నిలిచిపోయే ఓ సంఘటన జరిగింది. తొలిసారి టెస్టు మ్యాచ్​లో అరంగేట్రం చేసిన వీరిద్దరూ.. సమన్వయంతో ఆసీస్​ ఆటగాడు లబుషేన్​ను బోల్తా కొట్టించారు.

Debutants Mohammed Siraj Shubman Gill Combine To Dismiss Marnus Labuschagne
సిరాజ్‌, గిల్‌కు అది ఎంతో స్పెషల్‌!

By

Published : Dec 26, 2020, 10:32 PM IST

మొదటి మ్యాచ్ అంటే ఎవరికైనా ప్రత్యేకమే. దేశం తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తారు. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో శుభ్‌మన్‌ గిల్, మహ్మద్‌ సిరాజ్‌ అరంగేట్రం చేశారు. రెండు వికెట్లతో సిరాజ్‌ సత్తాచాటగా, ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ గిల్‌ (28*) అజేయంగా నిలిచాడు. అయితే తొలి రోజు ఆటలో వారిద్దరికీ జ్ఞాపకంగా నిలిచిపోయే ఓ సంఘటన జరిగింది.

భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 195 పరుగులకే కుప్పకూలింది. 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆ జట్టు‌ను లబుషేన్‌ (48), హెడ్‌ (38) ఆదుకున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ 86 పరుగులు సాధించారు. ఈ జోడీని విడదీయడానికి టీమ్​ఇండియా 27 ఓవర్ల పాటు శ్రమించాల్సి వచ్చింది. కాగా, హెడ్‌ను బుమ్రా బోల్తాకొట్టించి ఆసీస్‌ను దెబ్బతీశాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన లబుషేన్‌ నిలకడగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఆసీస్‌పై పైచేయి సాధించాలంటే భారత్‌కు అతడి వికెట్ ఎంతో కీలకం.

ఈ సమయంలో కెప్టెన్ రహానె బంతిని సిరాజ్‌కు అందించాడు. లబుషేన్‌ తడబాటును గ్రహించిన సిరాజ్..‌ తెలివిగా లెగ్‌వికెట్‌ వైపు బంతిని విసిరాడు. దీంతో ఫ్లిక్‌ షాట్‌కు ప్రయత్నించిన లబుషేన్‌.. బ్యా‌క్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో ఉన్న గిల్‌ చేతికి చిక్కాడు. కాస్త కష్టతరమైన క్యాచ్‌ను గిల్‌ ఎలాంటి పొరపాటు లేకుండా అద్భుతంగా అందుకున్నాడు. దీంతో టెస్టు కెరీర్‌లో సిరాజ్‌ తొలి వికెట్‌ సాధించగా, గిల్‌ మొదటి క్యాచ్‌ను అందుకున్నాడు. కీలక ఆటగాడు లబుషేన్‌‌ను వీరిద్దరు తమ తొలి మ్యాచ్‌లో సమన్వయంతో బోల్తాకొట్టించడం అందర్నీ ఆకట్టుకుంది. కాగా, ఈ వీడియోను 'క్రికెట్ ఆస్ట్రేలియా' తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇదీ చూడండి:తొలిరోజు ఆట అదుర్స్​.. జింక్స్​పై ప్రశంసలు!

ABOUT THE AUTHOR

...view details