దంచుడే దంచుడు. పరుగులే పరుగులు. గువాహటిలో చివరికి టీమ్ఇండియాదే పైచేయి అయినా దక్షిణాఫ్రికా పోరాటమూ ఆకట్టుకుంది.
అలవాటైన రీతిలో సూర్య భగ్గుమన్న వేళ.. రాహులూ దూకుడు పెంచిన సమయాన.. రోహిత్, కోహ్లి కూడా సమయోచితంగా రాణించిన తరుణాన పరుగుల వరద పారించిన భారత్ రెండో టీ20లోనూ గెలిచి, మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకుంది. అయినా ఏదో అసంతృప్తి. కొండంత స్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో గెలుపు కోసం భారత్‌కు కష్టపడక తప్పలేదు. ప్రత్యర్థి అంత తేలిగ్గా తలవంచలేదు. వీరబాదుడు బాదిన మిల్లర్ పెను విధ్వంసంతో రోహిత్ బృందాన్ని కలవరపెట్టాడు. తొలి టీ20లో అదరగొట్టిన అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 62 పరుగులివ్వడమే కాదు.. మూడు నోబాల్స్, రెండు వైడ్లు వేసి ప్రపంచకప్ ముంగిట మన బౌలింగ్‌పై ఆందోళనను ఇంకా పెంచాడు.
టీమ్ఇండియా మురిసింది. ఆదివారం భారీ స్కోర్ల మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట భారత్ దంచి కొట్టింది. సూర్యకుమార్ (61; 22 బంతుల్లో 5×4, 5×6), రాహుల్ (57; 28 బంతుల్లో 5×4, 4×6), కోహ్లి (49 నాటౌట్; 28 బంతుల్లో 7×4, 1×6), రోహిత్ (43; 37 బంతుల్లో 7×4, 1×6) చెలరేగడంతో 3 వికెట్లకు 237 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఛేదన ఆరంభంలో తడబడ్డా దక్షిణాఫ్రికా గట్టి పోటీ ఇచ్చింది. మిల్లర్ (106 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 7×6), డికాక్ (69 నాటౌట్; 48 బంతుల్లో 4×3, 4×6) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సంపాదించింది. చివరి టీ20 మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.
మిల్లర్ విధ్వంసం:కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆపై ఒక్క పరుగుకే రెండు వికెట్లు పడగొట్టింది. అయినా భారత్‌కు కంగారు తప్పలేదు. విజయం అనుకున్నంత తేలిగ్గా దక్కలేదు. రెండో ఓవర్లో అర్ష్‌దీప్ బవుమా (0), రొసో (0)ను ఔట్ చేయడం ద్వారా దక్షిణాఫ్రికాకు షాకిచ్చినా.. డికాక్, మార్క్రమ్ (33; 19 బంతుల్లో 4×4, 1×6) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ముఖ్యంగా మార్క్రమ్ చెలరేగిపోయాడు. ఆరు ఓవర్లకు స్కోరు 45/2. ఏడో ఓవర్లో మార్క్రమ్ను అక్షర్ బౌల్డ్ చేయడంతో భారత్ పట్టు బిగిస్తుందేమో అనిపించింది. 10 ఓవర్లకు స్కోరు 70/3. కానీ క్రమంగా జోరు పెంచిన మిల్లర్ విధ్వంసక విన్యాసాలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఎడా పెడా ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. భారత బౌలర్లు కూడా లయ తప్పారు. వారిని మిల్లర్ ఏమాత్రం లెక్క చేయలేదు. మిల్లర్ ధాటికి 12వ ఓవర్లో అశ్విన్ 19 పరుగులు సమర్పించుకోగా.. ఆలస్యంగా జోరందుకున్న డికాక్ ధాటికి ఇన్నింగ్స్ 15వ ఓవర్లో అక్షర్ 18 పరుగులిచ్చుకున్నాడు. అర్ష్‌దీప్, హర్షల్ కూడా వాళ్లను నియంత్రించలేకపోయారు. అయినా చివరి నాలుగు ఓవర్లలో గెలవాలటే దక్షిణాఫ్రికా 82 పరుగులు చేయాల్సిన స్థితి. అయితే ఆ జట్టు ఓవర్‌కు 20కి పైనే చేయాల్సివున్నా బ్యాట్స్‌మెన్ జోరుతో భారత్‌ది కూడా ధీమాగా ఉండలేని పరిస్థితి. కానీ ఆ దశలో అద్భుతంగా బౌలింగ్ చేసిన దీపక్ చాహర్.. 17వ ఓవర్లో ఒకే ఒక్క బౌండరీ ఇచ్చి భారత్‌పై ఒత్తిడిని పోగొట్టాడు. ఆరంభంలో అతడు తన తొలి మూడు ఓవర్లలో 16 పరుగులే ఇవ్వడం విశేషం. 18వ ఓవర్లో హర్షల్ 11 పరుగులే ఇవ్వడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. అయితే చివరి రెండు ఓవర్లలో 63 పరుగులు చేయాల్సివున్నా, గెలుపు అసాధ్యమే అయినా మిల్లర్, డికాక్ మాత్రం ప్రయత్నం చేయకుండా వదల్లేదు. 19వ ఓవర్లో (అర్ష్‌దీప్) రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు దంచిన మిల్లర్.. అక్షర్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖరి రెండు ఓవర్లలో దక్షిణాఫ్రికా 46 పరుగులు రాబట్టింది. మిల్లర్, డికాక్ జంట అభేద్యమైన నాలుగో వికెట్‌కు 174 పరుగులు జోడించింది.