India South Africa Series 2022 : దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయంతో టీమ్‌ఇండియా సగర్వంగా టీ20 ప్రపంచకప్ వైపు అడుగులు వేసింది. గువాహటిలో జరిగిన రెండో టీ20లో రోహిత్ సేన దంచికొట్టింది. అయితే.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అటువైపు నుంచి కూడా అంతే దీటుగా సమాధానం వచ్చింది. లక్ష్యానికి కేవలం 16 పరుగుల దూరంలోనే సఫారీలు నిలిచిపోయారు. కొండంత స్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో గెలుపు కోసం భారత్ కష్టపడక తప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి టీమ్ ఇండియా డెత్ ఓవర్ల బౌలింగ్‌పై చర్చ మొదలైంది. మ్యాచ్ అనంతరం ఈ అంశంపై సారథి రోహిత్ కూడా స్పందించాడు.
డెత్ ఓవర్ల అంశం ఆందోళన కలిగించకపోయినా.. మ్యాచ్ చివరలో జట్టు తన పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని రోహిత్ చెప్పాడు. 'జట్టు ఒక నిర్ధిష్ట పద్ధతితో బౌలింగ్ చేయాలని కోరుకుంటుంది. ఆ రకంగా బౌలర్లకు స్వేచ్ఛనివ్వాలనుకుంటాం. నిజమే.. మేం గత ఐదారు మ్యాచ్‌ల్లో డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయలేదు. ఆ అంశమే మాకు సవాలు విసిరేది' అని రోహిత్ పేర్కొన్నాడు.
'అయితే.. డెత్ ఓవర్లలో బౌలింగ్, బ్యాటింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఆట ఫలితం తేలేదీ ఇక్కడే. ఇది ఆందోళన చెందే విషయమని నేను చెప్పను. కానీ.. ఇది కచ్చితంగా మనం కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అంశం' అని హిట్‌మ్యాన్ వివరించాడు.