Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు.. క్రిస్మస్ మరుసటి రోజు డిసెంబర్ 26 నుంచి ప్రారంభమై 30వ తేదీన ముగిసే మ్యాచ్ అంటే ఎంతో ప్రత్యేకమైంది. అయితే 1865 నుంచి ఆసీస్ తలపడే మ్యాచ్‌లకు మాత్రమే 'బాక్సింగ్ డే టెస్టు' అని వాడుతుండేవారు. ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌లో ఏదొక మ్యాచ్ బాక్సింగ్ డే రోజున మెల్‌బోర్న్ వేదికగా ఉండేలా షెడ్యూల్ తయారు చేసేవారు. ఇతర దేశాలతోనూ బాక్సింగ్ డే టెస్టుల్లో ఆసీస్ తలపడిన సందర్భాలూ ఉన్నాయి. అయితే అదే తేదీన ఇతర జట్లూ ఆడే టెస్టులను 'బాక్సింగ్ డే' టెస్టులని పిలవకపోయినా.. అలాగే వ్యవహరించేవారు. ఇప్పటి వరకు టీమ్‌ఇండియా 10 బాక్సింగ్ డే టెస్టులను ఆడింది. అందులో తొమ్మిదిసార్లు ఆసీస్‌తో, ఒకసారి దక్షిణాఫ్రికాతో ఆడింది. అయితే మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. మరి ఎప్పుడు ఆడిందో తెలుసుకుందాం..
వరుసగా మూడోసారి విజయం..
టీమ్‌ఇండియా 1985 నుంచి బాక్సింగ్ డే టెస్టుల్లో తలపడుతోంది. ఇవాళ దక్షిణాఫ్రికాపై విజయంతో కలుపుకొని కేవలం మూడు సార్లు మాత్రమే గెలవడం గమనార్హం. అదీనూ వరుసగా కావడం విశేషం. ఇందులో రెండుసార్లు విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. ఒకసారి అజింక్య రహానె నేతృత్వంలో విజయాలను అందుకుంది.
- కోహ్లీ నేతృత్వంలోని భారత్ 2018లో ఆసీస్ పర్యటనకు వెళ్లింది. బాక్సింగ్ డే రోజున ప్రారంభమైన మూడో టెస్టులో టీమ్‌ఇండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- మరోసారి 2020లో కోహ్లీ నాయకత్వంలోనే ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే రెండో టెస్టు నాటికి కోహ్లీ పితృత్వపు సెలవుల మీద భారత్‌కు వచ్చేశాడు. దీంతో అజింక్య రహానె సారథ్య బాధ్యతలు చేపట్టాడు. మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు)లో టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది.
- ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కోహ్లీ కెప్టెన్సీలో గెలిచింది. వరుసగా మూడోసారి కూడానూ బాక్సింగ్ డే టెస్టును సొంతం చేసుకున్న జట్టుగా నిలిచింది. అంతేకాకుండా సెంచూరియన్ మైదానంలో భారత్ తొలిసారి విజయం సాధించడం విశేషం.