ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. వైజాగ్ వేదికగా జరగనున్న మరో ఆసక్తికరమైన పోరుకు సిద్దమౌతోంది. వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో ఆసీస్‌తో రోహిత్ సేన తలపడనుంది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్.. ఆ మ్యాచ్‌లో విజయం సాధించడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తోంది.
శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలైన ఆసీస్ జట్టు.. తదుపరి మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో బరిలోకి దిగుతోంది. అయితే వైజాగ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌కు సర్వం సిద్ధమౌతున్న వేళ అక్కడి మైదానం భారత్‌కు అనుకూలంగా ఉండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. ఇక బావమరిది పెళ్లి కోసం తొలి వన్డేకు దూరంగా ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు రానున్నాడు. తనకు అచ్చొచ్చిన అమ్మమ్మ వాళ్ల ఊరిలో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు రోహిత్. దీంతో అతడి స్థానంలో తొలి వన్డే ఆడిన ఇషాన్ కిషన్ ఇప్పుడు జట్టు నుంచి తప్పుకోనున్నాడు.
తొలి వన్డేలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు విఫలమయ్యారు. వారి స్థానంలో మరెవరూ రానున్నప్పటికీ ఆశించిన స్థాయి ప్రదర్శన చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇక సూర్య కుమార్‌కు ఈ మ్యాచ్ ఓ అగ్ని పరీక్ష లాంటిది. టీ20 ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు.. వన్డేల్లో మాత్రం పేలవ ప్రదర్శనతో సరైన ముద్ర వేయలేకపోతున్నాడు. ముంబయి వన్డేలో అయితే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో వైజాగ్ వన్డేలో అతడికి కీలకం కానుంది. ఒకవేళ ఇందులో అతడు విఫలమైతే తన స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ఆటగాడు టీమ్‌లోకి రానున్నాడు!