టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో టీమ్‌ఇండియా గొప్ప పదర్శనతో రాణిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్సాహం మరింత రెట్టింపు కావాలంటే జట్టుపై మరింత దృష్టి సారించాలని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. దినేశ్ కార్తీక్‌కు బదులుగా జట్టుకు రిషభ్ పంత్‌లాంటి వికెట్ కీపర్ అవసరమని తెలిపాడు. ఇటీవల మ్యాచుల్లో తన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ ఫామ్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశాడు.
'ఇప్పుడు జట్టులో రిషభ్ పంత్ ఉంటే బాగుంటుంది. దినేశ్ కార్తీక్ ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ మనకు కీలకమైనప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండర్ ఎంతో అవసరం. అతడుంటే టీమ్‌ఇండియా పరిపూర్ణమవుతుంది' అని తెలిపాడు. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచుల్లో రాణించలేకపోయిన కేఎల్ రాహుల్ ఫామ్‌పై మాట్లాడుతూ.. 'అతడు బాగా ఆడగలడు. ఇదివరకు మ్యాచుల్లో రాహుల్ బ్యాటింగ్ చూస్తే తనెప్పుడూ కష్టపడుతున్నట్టుగా అనిపించలేదు. ఎక్కువ రన్స్ స్కోర్ చేయడం రాహుల్‌కి ఇప్పుడు చాలా కీలకం. మొదట నిదానంగా ఆడినా అవసరమైనప్పుడు వేగం పుంజుకోగలడు. అందుకే అతడు కాస్త సహనంతో మొదటి 8-9 ఓవర్లు పూర్తి చేయగలగాలి. ఆ తర్వాత అదును చూసి విజృంభించవచ్చు' అని సూచించాడు.