Ind Vs Afg Match Asia Cup 2022: స్టార్లకు కొదువలేకున్నా వరుస పరాజయాలు చవిచూసింది. టైటిల్ ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టినా ఫైనల్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఊరట విజయం కోసం చూస్తోంది. ఆసియాకప్‌లో తన చివరి మ్యాచ్‌లో నేడు అఫ్గానిస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఫైనల్ దారులు ఎలాగూ మూసుకుపోయిన నేపథ్యంలో.. కనీసం లోపాలన్నా సరిదిద్దుకుని జట్టుగా గాడిన పడాలన్నది టీమ్‌ఇండియా ఉద్దేశం. అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేస్తే అది పొరపాటే అవుతుంది.
ఫైనల్‌కు దూరమై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన టీమ్‌ఇండియా ఆసియాకప్‌లో తన ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. గురువారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఢీకొంటుంది. వరుసగా పాకిస్థాన్, శ్రీలంకల చేతుల్లో ఓడి నిరాశ చెందిన రోహిత్‌సేన ఎలా పుంజుకుంటుందో చూడాలి. అఫ్గానిస్థాన్‌తో పోరు తేలికైతే కాదు. గత రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందనడంలో సందేహం లేదు. సరైన వనరులు లేకపోవడం, జట్టు ఎంపికలో లోపాలు కూడా జట్టుకు ప్రతికూలమయ్యాయి. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌లు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి, ప్రత్యామ్నాయాలను పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటివరకైతే అనిపించలేదు. పంత్ లేదా దీపక్ హుడా స్థానంలో దినేశ్ కార్తీక్‌ను తిరిగి జట్టులో తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరం. హుడా గత మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.
అతడికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. అయితే లంక ఓపెనర్లు విరుచుకుపడుతున్న నేపథ్యంలో తాను హుడాకు బంతిని ఇవ్వలేకపోయానని ఆ తర్వాత రోహిత్ సమర్థించుకున్నాడు. అయిదో స్పెషలిస్ట్ బౌలర్‌గా హార్దిక్ పాండ్యను ఆడించే వెసులుబాటు భారత్‌కు లేదని, అలా చేస్తే అది ఆల్‌రౌండర్‌గా అతడి భారాన్ని పెంచుతుందని కూడా శ్రీలంకతో మ్యాచ్‌తో రుజువైంది. యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లతో కాస్త ఫామ్‌ను అందుకున్నాడు. కానీ భారత్‌కు దీపక్ చాహర్ లాంటి వాడు కావాలి. ప్రపంచకప్‌కు ముందు అతణ్ని ఆడించి చూడాల్సిన అవసరముంది. ఇక రోహిత్ బ్యాటుతో సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాడు. అదే దృక్పథంతో కొన్ని మ్యాచ్‌ల్లోనైనా టాప్-3లో మార్పులు చేసి, ఫలితాల్లో తేడా వస్తుందేమోనని చూస్తాడా అన్నది చూడాలి. గత రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లలో పేలవ బౌలింగ్ కూడా భారత్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా రెండు మ్యాచ్‌ల్లోనూ 19వ ఓవర్లో భువనేశ్వర్ చాలా పేలవంగా బౌలింగ్ చేశాడు. అతడు బలంగా పుంజుకోవడం భారత్‌కు అవసరం.