Team India: ప్రపంచకప్ ముందు టీమ్‌ఇండియాకు వరుస గాయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా ఐసీసీ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న భారత్‌కు.. దీపక్ చాహర్ గాయంతో మూడో షాక్ తగిలిందని సమాచారం. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా వైదొలిగారు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శనపై గాయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే ఆందోళన మొదలైంది.
ఇద్దరూ టాపర్లే..
రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ ఫామ్‌లోకి వచ్చేశారు.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైపోయాడు.. అని ఆనందంతో ఉన్న టీమ్‌ఇండియాకు తొలి ఎదురు దెబ్బ రవీంద్ర జడేజా రూపంలో తగిలింది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాక్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా మోకాలి గాయం కారణంగా.. శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకోవడంతో మెగా టోర్నీకి జట్టును ప్రకటించకముందే వైదొలిగిన తొలి ఆటగాడిగా మారిపోయాడు.
చాలా రోజులపాటు ఆటకు దూరమై.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో జట్టులోకి వచ్చిన స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా కూడా భారీ షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు వెన్ను నొప్పి వస్తోందని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ మ్యాచ్‌తోపాటు టీ20, వన్డే సిరీస్‌లకూ దూరమయ్యాడు. సరే ఇంకా సమయం ఉంది కదా.. ఈ లోపు కోలుకొని మెగా టోర్నీకి అందుబాటులోకి వస్తాడని భావించిన సగటు భారత క్రికెట్ అభిమానికి షాకింగ్ నిర్ణయం వచ్చింది. ఆ సిరీస్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌నకూ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై బుమ్రా కూడా స్పందిస్తూ.. మెగా టోర్నీలో ఆడలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నాడు.
"జాతీయ జట్టు తరఫున ఆడేందుకు ఆటగాళ్లకు గాయాలు సాకుగా మారాయి. అదే భారత టీ20 లీగులో మాత్రం అన్ని మ్యాచ్‌లను ఆడేస్తారు".. ఇదీ బుమ్రా వైదొలగడంపై అభిమానుల నుంచి వచ్చిన కౌంటర్.
ఏంటి నష్టం?
ఓ ముగ్గురు ఆటగాళ్లు లేకపోతేనే భారత్ టీ20 ప్రపంచకప్ నెగ్గలేదా..? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇతర ప్లేయర్లు ఆ స్థానాలను భర్తీ చేయలేరా..? అని ప్రశ్నలు వస్తున్నాయి. బుమ్రాకి బదులు షమీ, సిరాజ్ వంటి పేసర్లు భారత్‌కు ఉన్నారు. అలాగే రవీంద్ర జడేజా లేకపోయినా.. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఆల్‌రౌండర్లూ భారత్ సొంతం. అయితే కీలక ఆటగాళ్లు గైర్హాజరైతే.. జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తారు. ఉదాహరణకు ఫాస్ట్ బౌలర్ బుమ్రా లేకపోవడం వల్ల.. డెత్ ఓవర్లలో టీమ్‌ఇండియా కాస్త బలహీనంగా మారింది. బుమ్రా స్థానంలో తుది జట్టులో షమీ/సిరాజ్.. ఎవరు ఉంటారో తెలియదు. షమీ అయితే డెత్ ఓవర్లను చాలా బాగా హ్యాండిల్ చేయగలడని మాజీల విశ్లేషణ. కానీ బుమ్రా లేనిలోటు మాత్రం తీర్చలేనిదని స్పష్టం. ఎందుకంటే తనదైన యార్కర్లతో టాప్ బ్యాటర్లను సైతం వణికిస్తాడు. ఇప్పుడు బుమ్రా లేకపోవడంతో ప్రత్యర్థులు మన బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కోగలమనే భావిస్తారు.