ఫామ్‌లేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మద్దతుగా నిలిచాడు మాజీ వికెట్‌కీపర్ ఫరూక్ ఇంజనీర్. కోహ్లీపై భారీ అంచనాలు ఉంటున్నాయని.. బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి అతడి నుంచి సెంచరీని ఆశించడం సబబుకాదని పేర్కొన్నాడు. విరాట్ కూడా అందరిలా మనిషేనని తెలిపాడు. టెస్టుల్లో అతడిప్పటికి 40, 50 పరుగులు సాధిస్తున్నాడని చెప్పాడు.
కోహ్లీ.. చివరిసారిగా 2019 నవంబర్‌లో బంగ్లాతో జరిగిన డై/నైట్ టెస్టులో శతకాన్ని అందుకున్నాడు. 2020 నుంచి అతనాడిన 10 టెస్టుల్లో 407 పరుగులు సాధించాడు. కోహ్లీ కెరీర్ సగటు 51.41 కాగా, 2020 నుంచి ఇప్పటివరకు 23.94 సగటుతో బ్యాటింగ్ చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన విరాట్.. లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 42, 20 రన్స్ కొట్టాడు. దీంతో అతడి బ్యాటింగ్‌పై చర్చ నడుస్తోంది.
తాజాగా ఈ విషయమై ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన ఫరూక్.. ఇంగ్లాండ్ సారథి జో రూట్ నిలకడగా పరుగులు చేస్తున్న చోట విరాట్ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. "అలా అని కోహ్లీని నిందించినట్లు కాదు. ఇప్పటికీ అతడు గొప్ప ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో విరాట్ ఒకడు. అందరిలో కోహ్లీ ఒకడు. ఎందుకంటే అతడు పరుగులు సాధిస్తున్నాడు. రూట్ ఎక్కువ పరుగులు చేస్తున్నాడు. అతడు బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి సెంచరీ ఆశించడం సరికాదు. ఆటకు తోడు అదృష్టం కూడా కలిసిరావాలి. అతడు కూడా మనిషే. మనిషి అనేవాడు తప్పులు చేయడం సహజం. విరాట్ కూడా అంతే. దురదృష్టవశాత్తూ ఔట్ అవుతున్నాడు" అని ఫరూక్ తెలిపాడు.