తెలంగాణ

telangana

WTC 2: ఈసారీ పాకిస్థాన్​తో మ్యాచ్​ లేదు

By

Published : Jul 15, 2021, 7:37 AM IST

2021-23 మధ్య సాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో టోర్నీకి షెడ్యూల్‌ను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC). వచ్చే నెల భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచే డబ్ల్యూటీసీ రెండో టోర్నీ ప్రారంభంకానుంది. అయితే టెస్టు ఛాంపియన్​షిప్​-2లోనూ భారత్​-పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​లు షెడ్యూల్​ చేయలేదు.

WTC 2 schedule
డబ్ల్యూటీసీ 2

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) తొలి టోర్నీ విజయవంతమైన నేపథ్యంలో.. రెండో టోర్నీకి ఐసీసీ సన్నాహాలు పూర్తి చేసింది. 2021-23 మధ్య సాగే కొత్త ఛాంపియన్‌షిప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. వచ్చే నెల భారత్‌-ఇంగ్లాండ్‌ల మధ్య మొదలయ్యే అయిదు టెస్టుల సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ కొత్త టోర్నీ శ్రీకారం చుట్టుకుంటుంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌ను ఇంగ్లాండ్‌ పర్యటనతో మొదలు పెట్టి, ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల్లోనూ భారత్‌ పర్యటించనుంది. సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడుతుంది. గత టోర్నీలో మాదిరే ఈసారి కూడా పాకిస్థాన్‌తో భారత్‌కు సిరీస్‌ లేదు. దాదాపు దశాబ్దం నుంచి భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడట్లేదన్న సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీలను మినహాయిస్తే తటస్థ వేదికల్లోనూ ఇరు జట్లూ తలపడట్లేదు.

కొత్త పాయింట్ల విధానం..

ఇక డబ్ల్యూటీసీ రెండో టోర్నీలో కొత్త పాయింట్ల విధానానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. విజయానికి 12, డ్రాకు 4, టైకి 6 పాయింట్లు కేటాయించనుంది. గత డబ్ల్యూటీసీలో ఒక సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు 60 పాయింట్లు వచ్చేవి. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు 24 పాయింట్లు వస్తున్నందున సమానత్వం లేదని.. లోటుపాట్లు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. "పాయింట్ల విధానాన్ని సరళీకరించాలన్న సూచనలు అందాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న క్రికెట్‌ కమిటీ మ్యాచ్‌ల వారీగా కొత్త పాయింట్ల విధానాన్ని ప్రతిపాదించింది. జట్ల స్థానాల్ని డబ్ల్యూటీసీ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా నిర్ణయించాలన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించనున్నాం" అని ఐసీసీ తాత్కాలిక సీఈఓ జెఫ్‌ అలార్డైస్‌ పేర్కొన్నాడు. 2021-23 డబ్ల్యూటీసీ 9 టెస్టు జట్లలో ఒక్కోటి ఆరు సిరీస్‌లు ఆడతాయి. సొంతగడ్డపై, విదేశాల్లో మూడేసి సిరీస్‌ల్లో బరిలో దిగుతాయి. ఈ డబ్ల్యూటీసీలో ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లున్న సిరీస్‌లు తక్కువగా ఉన్నాయి. భారత్‌-ఇంగ్లాండ్‌ పోరు.. యాషెస్‌ (ఆస్ట్రేలియా × ఇంగ్లాండ్‌)లే 5 మ్యాచ్‌ల సిరీస్‌లు. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య 4 మ్యాచ్‌ల సిరీస్‌ మినహాయిస్తే మిగతావన్నీ మూడు, అంతకన్నా తక్కువ మ్యాచ్‌లవే.

ఇవీ చదవండి:ఇంగ్లాండ్​కు అశ్విన్​ హెచ్చరికలు.. ఒకే ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లు

ABOUT THE AUTHOR

...view details