India Fast Bowling Future :సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి అనేక చర్చలకు దారి తీస్తోంది. ముఖ్యంగా జట్టు పేస్ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించినప్పటికీ మహ్మద్ సిరాజ్ (2) స్థాయికి తగ్గట్లు రాణించలేదు. మరీ ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఠాకూర్ ఏకంగా 5.30 ఏకనమీతో 101 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో టీమ్ఇండియా బౌలింగ్ భారాన్ని మోసేది ఎవరు? పేస్‌కు నాయకత్వం వహించేంది ఎవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి!
ఒకప్పుడు టీమ్ఇండియాకు టెస్టు, వన్డేల్లో ఆశిష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, జహీర్‌ఖాన్ ఉండేవారు. వీరి తర్వాత ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఆ భారాన్ని మోస్తూ అందరి అంచనాలను అందుకున్నారు. టీమ్ఇండియాకు స్వదేశం, విదేశీ పిచ్‌లపై అత్యుత్తమ ప్రదర్శన చేశారు. జట్టుకు సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో విదేశీ (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పిచ్‌లపై విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ, వీళ్ల తర్వాత అంతటి పేస్ దళాన్ని తయారుచేయడానికి మేనేజ్మెంట్ కసరత్తులు చేయట్లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా విదేశీ గడ్డపై ఆడే టెస్టుల్లో ప్రభావం చూపే పేసర్లే కరవయ్యారు.