ఒకే సమయంలో రెండు వేర్వేరు దేశాల్లో సిరీస్‌ల కోసం రెండు జాతీయ క్రికెట్ జట్లను మోహరించనున్న తొలి దేశంగా భారత్ నిలవబోతుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ అన్నాడు. కివీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఆ తర్వాత రూట్ సేనతో అయిదు టెస్టుల సిరీస్ కోసం కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్ వెళ్లనుంది. అదే సమయంలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం మరో భారత పురుషుల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.
"రెండో భారత జట్టును ఓ సిరీస్ కోసం పంపించాలనే ఆలోచన ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం భారత్ చేస్తున్నట్లుగానే గతంలో ఆస్ట్రేలియా రెండు జట్లను ఆడించాలనుకుని ప్రయత్నించి విఫలమైంది. కానీ ఇప్పుడు భారత్ విజయవంతమయ్యేలా కనిపిస్తోంది. ఓ జాతీయ జట్టు.. రెండుగా ఏర్పడి ఒకే సమయంలో రెండు దేశాల్లో సిరీస్‌లు ఆడబోతుండడం ఇదే తొలిసారని అనుకుంటున్నా. ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెట్ దశ అయిన 1995 నుంచి 2010 మధ్య కాలంలో 'ఎ', 'బి'గా రెండు అంతర్జాతీయ జట్లుగా ఏర్పడి సిరీస్‌లు ఆడాలనుకుంది. కానీ వాళ్లకు అనుమతి రాలేదు. ఆస్ట్రేలియా వల్ల కానిది.. ఇప్పుడు భారత్ చేయనుంది. రిజర్వ్ బెంచ్ బలం కారణంగానే ఆ జట్టుకు ఇది సాధ్యమవుతుంది."