తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS AUS: కేఎల్​ రాహుల్​ కమ్​ బ్యాక్​.. తొలి వన్డేలో భారత్​ విజయం - తొలి వన్డేలో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్​ విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలోనే ఛేదించింది.

India beat Australia by five wickets in first ODI in Mumbai
IND VS AUS: తొలి వన్డేలో భారత్​ విజయం

By

Published : Mar 17, 2023, 9:20 PM IST

Updated : Mar 17, 2023, 9:38 PM IST

ముంబయి వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది. ఆసీస్​ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 39.5 ఓవర్లలోనే ఛేదించింది. కేఎల్ రాహుల్ (75*) హాఫ్​సెంచరీ సాధించగా.. రవీంద్ర జడేజా (45) కీలక రన్స్​ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (25), శుబ్​మన్​ గిల్​ (20) పర్వాలేదనిపించారు. మిచెల్ స్టార్క్ 3, స్టోయినిస్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

రాణించిన రాహుల్​.. టీ20, టెస్టుల్లో వరుసగా విఫలమవుతూ జట్టులో చోటు కూడా కోల్పోయిన కేఎల్ రాహుల్.. వన్డేల్లో మాత్రం తన క్లాస్ గేమ్​ను చూపించాడు. ప్రస్తుతం ఫామ్​లో ఉన్న శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్​లో విఫలమైన నేపథ్యంలో.. హాఫ్​ సెంచరీతో అజేయంగా నిలిచి టీమ్​ఇండియాను ఆదుకున్నాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా 91 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 75 పరుగులు చేసి తన వన్డే కెరీర్​లో 13వ అర్ధ శతకం అందుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రవీంద్ర జడేజా 69 బంతుల్లో ఐదు ఫోర్లతో 45 రన్స్ సాధించాడు.

మ్యాచ్ సాగిందిలా.. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 16 రన్స్​కే మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 31 బంతుల్లో మూడు ఫోర్లతో 20 రన్స్​ చేసిన శుబ్‌మన్ గిల్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అవ్వడం వల్ల 39 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ పని అయిపోయిందనుకున్నారు. ఈ సమయంలోనే కేఎల్‌ రాహుల్‌ ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. హార్దిక్​ పాండ్యతో కలిసి ఐదో వికెట్‌‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన హార్దిక్​.. స్టోయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి.. బౌండరీ లైన్​ దగ్గర కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా 83 రన్స్ దగ్గర​ ఐదో వికెట్​ను కోల్పోయింది టీమ్​ఇండియా. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌కు జడేజా తోడుగా నిలిచాడు. ఇద్దరు కలిసి ఆచితూచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అలా కేఎల్‌ రాహుల్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కాస్త వేగం పెంచి జడ్డూతో కలిసి దూసుకెళ్లాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 108 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అంతకముందు ఫస్ట్​ బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 35.4 ఓవర్లలోనే 188 పరుగులకు ఆలౌట్‌ అయింది ఆసీస్​. మిచెల్‌ మార్ష్‌ 81 రన్స్​తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షమీ, సిరాజ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. జడేజా రెండు, కుల్దీప్‌ , హార్దిక్​ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇకపోతే ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్​ మార్చి 19న(ఆదివారం) విశాఖపట్నం వేదికగా జరగనుంది.

ఇదీ చూడండి:

మిచెల్​ స్టార్క్​ అరుదైన ఫీట్​.. 'నాటు నాటు' సాంగ్​కు కోహ్లీ స్టెప్పులు

జడ్డూ, షమీ, గిల్​ స్టన్నింగ్​ క్యాచ్​లు.. చూశారంటే వావ్​ అనాల్సిందే!

Last Updated : Mar 17, 2023, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details